కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ.. భారతీయ కుటుంబం మృతి…
- కెనడా-యూఎస్ సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నది దాటుతూ మృతి
- మృతుల్లో రొమేనియా, ఇండియా కుటుంబాలు
- మృతి చెందిన మూడేళ్ల చిన్నారి వద్ద కెనడా పాస్‌పోర్ట్
కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ భారతీయ కుటుంబం కూడా ఉంది. వీరంతా కెనడా నుంచి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో అమెరికాలోకి ప్రవేశిస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కెనడా-అమెరికా సరిహద్దులోని సెయింట్ లారెన్స్ నదిలోని చిత్తడి ప్రాంతంలో గురువారం వీరి మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
మృతుల్లో రొమేనియా, ఇండియాకు చెందిన రెండు కుటుంబాలు ఉన్నట్టు పేర్కొన్నారు. పోలీసులు తొలుత 6 మృతదేహాలను వెలికి తీశారు. బుధవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకున్నట్టు చెప్పారు. తాజాగా హెలికాప్టర్ ద్వారా జరిపిన గాలింపు చర్యల్లో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ కెనడా నుంచి అక్రమంగా యూఎస్‌లోకి ప్రవేశిస్తూ మృత్యువాత పడినట్టు అధికారులు తెలిపారు. మృతి చెందిన మూడేళ్ల చిన్నారికి కెనడా పాస్‌పోర్టు ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ ఘటన హృదయాలను ద్రవించివేసిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీమళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, గతేడాది డిసెంబరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. యూఎస్‌లో ఉన్న భార్యా, పిల్లలను కలిసేందుకు నది దాటేందుకు ప్రయత్నించిన ఫ్రిట్జ్‌నెల్ రిచర్డ్ (44) కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయాడు.