ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదని జగన్ భావిస్తే అది పగటికలే: చంద్రబాబు…
- చాలామంది వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారన్న చంద్రబాబు
- వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని వ్యాఖ్యలు
- రేపు ఎన్నికలు జరిపినా తాము సిద్ధమేనన్న చంద్రబాబు
- వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. వైసీపీలో ఉన్న నేతలు బానిసల్లా బతుకుతున్నారని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని సొంత బలంతోనే గెలిపించుకున్నామని స్పష్టం చేశారు.
జగన్ పెద్ద దోపిడీదారు అని, ఆయన పేదల ప్రతినిధి ఎలా అవుతాడని ప్రశ్నించారు. జగన్ వైఖరి చూస్తే పుట్టిందే రాష్ట్ర విధ్వంసం కోసం అన్నట్టుందని విమర్శించారు. జగన్ భవిష్యత్ ఏంటనేది ప్రజలు అంచనా వేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఏది మంచి, ఏది చెడు అనే విశ్లేషణ ఉండేదని, వైసీపీ పాలనలో ఎదురుదాడి తప్ప మరొకటి లేదని అన్నారు.
ముందస్తు ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదని జగన్ భావిస్తే అది పగటికలేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నామని సమరోత్సాహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది షాక్ ట్రీట్ మెంట్ అని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు శాశ్వత చికిత్స చేస్తారని తెలిపారు. “ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో వారికి చెప్పాలా? 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే మా లక్ష్యం” అని చంద్రబాబు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన వివేకా హత్యోదంతం పైనా స్పందించారు. వివేకా హత్య వ్యవహారం దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ అని అభివర్ణించారు. ఇన్ని ట్విస్టులున్న హత్య వ్యవహారం దేశంలో మరొకటి లేదన్నారు. ఫిక్షన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసు వీగిపోతే వ్యవస్థల మీద నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.