తెలంగాణకు చెడ్డపేరు తీసుకురావద్దు… ఏపీ అంబులెన్సులను నిలిపివేతపై : జగ్గారెడ్డి
సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల నిలిపివేత
తెలంగాణ సర్కారుపై విమర్శలు
స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ప్రజల ఇబ్బందులు గమనించాలని హితవు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన అనంతరం ఏపీ తెలంగాణ సరిహద్దులవద్ద ఆంధ్ర నుంచి వస్తున్నా అంబులెన్సులు నిలిపివేతపై వివిధం రాజుకుంది. సరిహద్దు నియోజవర్గమైన జగ్గయ్యపేట -కోదాడ మధ్య ఉన్న చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అక్కడ ఉన్న పోలీసులతో మొదటి రోజు మాట్లాడి రెండు అంబులెన్సులను హైద్రాబాద్ కు పంపించగలిగారు. అయితే పైనుంచి వచ్చిన ఆదేశాలమేరకు తిరిగి అక్కడ ఉన్న పోలీసులు అడ్దకున్నారు. తిరిగి ఎమ్మెల్యే ఉదయభాను సరిహద్దుల వద్దకు వెళ్లి పోలీసులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసిన ఫలించలేదు. చివరకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఆయన పట్టించుకోలేదు. దీంతో ఇది ఇరు రాష్ట్రాలమధ్య వార్ లాగ మారడంతో హైకోర్టు దాక వెళ్ళింది. హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టింది ,సీరియస్ గా స్పందించింది . ఏపీ వాహనాలపై ఉన్న ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులపై తదుపరి ఆదేశాలు ఇచ్చన్తవరకు స్టే విధించింది. దీంతో అంబులెన్సులు తెలంగాణ లో రావడానికి మార్గం సుగమం అయింది.
తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను నిలిపివేస్తుండడం తీవ్ర వివాదంగా రూపుదాల్చుతోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తెలంగాణ సర్కారు వైఖరిని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల అంబులెన్సులను కేసీఆర్ సర్కారు అనుమతించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చే చర్యలు విడనాడాలని హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.
కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆక్సిజన్, రెమ్ డెసివిర్, వెంటిలేటర్ల కొరతతో ప్రజలు మృత్యువాత పడుతున్నారని వివరించారు. రెమ్ డెసివిర్ అందుబాటులో ఉండేలా కేటీఆర్ చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందిస్తూ, అది తమకు సంబంధించిన అంశం కాదన్నారు. ఈటల ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీ ఇంటి విషయం అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.