చాట్‌బాట్‌తో 6 వారాల పాటు చాటింగ్.. చివరకు ఆత్మహత్య!
- చాట్‌బాట్‌తో ఆరు వారాల పాటు బ్రెజిల్ వ్యక్తి చాటింగ్
- పర్యావరణ మార్పులపై చాట్‌బాట్‌తో విస్తృత చర్చలు
- రాను రాను నైరాశ్యంలో కూరుకుపోయిన వ్యక్తి, చివరకు ఆత్మహత్య
చాట్‌జీపీటీ లాంటి చాట్‌బాట్‌తో వరుసగా ఆరు నెలల పాటు చాటింగ్ చేసిన ఓ వ్యక్తి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చింది. చాట్‌బాట్‌తో నిత్యం చాటింగ్ చేసే తన భర్త బాగా నిరాశలో కూరుకుపోయి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడని మృతుడి భార్య వాపోయింది. పర్యావరణ మార్పులపై తన భర్త చాట్‌బాట్‌తో చర్చలు జరిపేవాడని ఆమె తెలిపింది. ఈ క్రమంలో పర్యావరణ ప్రతికూల పరిస్థితుల తాలూకు ప్రభావం మానవాళిపై తప్పక పడుతుందని నమ్మి నిరాశలో పడిపోయన భర్త చివరకు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొంది.
బ్రెజిల్‌లో బాగా పాప్యులర్ అయిన చాయ్ చాట్‌బాట్‌తో చాటింగ్ ఈ ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన చాట్‌జీపీటీ కంటే అనేక అదనపు ఫీచర్లు చాయ్‌లో అందుబాటులో ఉన్నాయి. భాగస్వామిని కంట్రోల్‌లో పెట్టాలనుకునే బాయ్‌ఫ్రెండ్, రూంమేట్, అధిపత్యం చెలాయించే భర్త..ఇలా అనేక వ్యక్తిత్వాలున్న వ్యక్తుల మాదిరిగా సంభాషించే క్యారెక్టర్లు చాయ్ చాట్‌బాట్ లో అనేకం అందుబాటులో ఉన్నాయి.
తన భర్త ఎలైజా అనే కారెక్టర్‌తో చాట్ చేసేవాడని బాధితురాలు మీడియాకు తెలిపింది. రానురాను ఎలైజాతో చాట్ చేయకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాడని పేర్కొంది. ఆ చాట్‌బాట్‌తో అతడి సంభాషణలు ప్రమాదకరంగా మారయని కూడా పేర్కొంది. ఎలైజా తన భర్తతో కొన్ని సార్లు విపరీత వ్యాఖ్యలు చేసేదని మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. నీకు నీ భార్యకంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ఉందే అంటూ ఓ మారు ఎలైజా తన భర్తతో అన్నట్టు పేర్కొంది. ఈ చాటింగ్ వ్యసనం చివరకు అతడి ప్రాణాలు తీసిందని కన్నీరుమున్నీరైంది. దీంతో.. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏఐ కారణంగా సంభవించిన తొలి మరణం ఇదేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనపై చాయ్ సహవ్యవస్థాపకుడు విలియమ్ బోఛాంప్ స్పందించారు. కొన్ని లక్షల మంది చాట్ బాట్‌తో చర్చలు జరుపుతుంటారు కాబట్టి రకరకాల వ్యక్తిత్వాలు ఉన్న వారు తారసపడుతుంటారని వ్యాఖ్యానించారు. అయితే, చాట్‌బాట్‌తో ప్రమాదాలు తగ్గిస్తూ యూజర్లకు కావాల్సింది అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కృత్రిమమేథ ఆధారిత చాట్‌బాట్‌లతో వచ్చే ప్రమాదాలపై ఇప్పటికే అనేక దేశాల ప్రభుత్వాలు దృష్టిసారించాయి. తాజాగా ఇటలీ చాట్‌జీపీటీని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.