ధైర్యానికి ప్రతిరూపంలా కనిపించిన ఆ అమ్మాయిని కరోనా కబళించింది!
- కరోనాతో ఆసుపత్రిలో చేరిన అమ్మాయి
- ఎమర్జెన్సీ వార్డులో చికిత్స
- ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సెలైన్ తో దర్శనం
- లవ్యూ జిందగీ పాట వింటూ ఎంజాయ్ చేసిన వైనం
- విషమించిన పరిస్థితి… గురువారం మృతి
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. నిత్యం అనేకమందిని కబళిస్తూ ప్రజలను తీవ్రభయాందోళనలకు గురిచేస్తోంది. ధైర్యంగా ఉన్నవాళ్లను సైతం మృత్యువుకు బలిచేస్తోంది. అందుకు ఈ ఘటనే ఉదాహరణ.
ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఎమర్జెన్సీ వార్డులో కరోనాకు చికిత్స పొందుతూ, ముక్కుకు ఆక్సిజన్ పైపు, చేతికి సెలైన్ తో ఉన్న ఓ యువతి ఎంతో ఉల్లాసంగా (లవ్ యూ జిందగీ) పాట వింటుండడాన్ని ఆ వీడియోలో చూపారు. అత్యవసర చికిత్స పొందుతూ కూడా ఆ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా కనిపించడాన్ని చాలామంది అభినందించారు. కానీ ఇప్పుడా అమ్మాయి లేదు! కరోనా కాటుకు బలైపోయిన ఎంతో మందిలో తానూ ఒకరిగా మారిపోయి అందరినీ విషాదానికి గురిచేసింది.
ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోను ఢిల్లీ వైద్యురాలు మోనిక సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో చేరే సమయానికి తీవ్రస్థాయిలో కరోనాతో బాధపడుతోంది. ఆమెకు ఐసీయూలో చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఐసీయూలో ఖాళీ లేకపోవడంతో ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. చుట్టూ కరోనాతో నరకయాతన అనుభవిస్తున్న రోగుల మధ్యలో తాను కూడా చికిత్స పొందుతున్నప్పటికీ స్థైర్యం కోల్పోని ఆ యువతి… తనకు పాటలు వినాలనుందని డాక్టర్లకు చెప్పడంతో వారందుకు అంగీకరించారు. దాంతో తన బెడ్ పైనే కూర్చుని హ్యాపీగా పాటలు వింటూ ఎంజాయ్ చేసింది. అదంతా నాలుగు రోజుల క్రితం మాట!
కానీ, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. ఈ విషయాన్ని కూడా డాక్టర్ మోనికానే వెల్లడించారు. పరిస్థితులు మన చేతుల్లో లేవని, ఆ ధైర్యశాలి కోసం అందరం ప్రార్థిద్దాం అని పిలుపునిచ్చారు. కానీ ఎవ్వరి ప్రార్థనలు ఫలించలేదు… ఆ యువతి కరోనాపై పోరాటంలో ఓడిపోయింది… గురువారం తుదిశ్వాస విడిచింది.
సోషల్ మీడియాలో ఆమె మరణవార్తను కూడా డాక్టర్ మోనికానే పంచుకున్నారు. అంత సంతోషంగా కనిపించిన అమ్మాయిని కూడా కరోనా కబళించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని నెటిజన్లు విషాదంలో మునిగిపోయారు.