ఏటీఎం రిపేర్ చేస్తానంటూ వచ్చి చోరీ…!
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఘటన
- ఏటీఎం చెడిపోవడంతో రిపేర్ కంపెనీకి సమాచారమిచ్చిన సిబ్బంది
- రిపేర్ కంపెనీ నుంచి వచ్చానంటూ బ్యాంకులో ప్రత్యక్షమైన నిందితుడు
- అతడు వెళ్లిపోయాక ఏటీఎంలో రూ.50 వేలు మాయమైనట్టు గుర్తించిన సిబ్బంది
- వెంటనే పోలీసులకు ఫిర్యాదు
- నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ జరిగింది. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఏటీఎం రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ దొంగ ఏకంగా నగదుతో ఉడాయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొత్త సాయిబాబా గుడి రోడ్డులోని ఓ ఏటీఎం చెడిపోవడంతో బ్యాంకు సిబ్బంది.. ఏటీఎం రిపేర్ చేసే కంపెనీకి ఫోన్ చేశారు.
కాసేపటి తరువాత ఏటీఎం రిపేర్ కంపెనీ ఉద్యోగినంటూ ఓ వ్యక్తి బ్యాంకులో ప్రత్యక్షమయ్యాడు. ఏటీఎంకు మరమ్మతులు చేసి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక బ్యాంకు సిబ్బందికి ఊహించని షాక్ తగిలింది. ఏటీఎం నగదులో రూ.50 వేల మేర తక్కువగా ఉన్నట్టు గుర్తించి నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆగంతుకుడి జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.