కుట్ర పూరితంగా నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారు: ఈటల రాజేందర్..
- పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో విచారణ
- రాజకీయాల కోసం 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని ఈటల మండిపాటు
- కేసీఆర్ డైరెక్షన్ లోనే తమపై కేసులు పెట్టారని విమర్శ
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ ఆయనను గంటపాటు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుట్రపూరితంగానే తనపై నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. నీచ రాజకీయాల కోసం 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే తనపైనా, బండి సంజయ్ పైనా కేసులు నమోదు చేశారని అన్నారు. 22 ఏళ్లుగా తాను ప్రజా జీవితంలో ఉన్నానని, ఎంతో బాధ్యతతో ఉన్నానని చెప్పారు. అలాంటి తనపై పేపర్ లీక్ కేసు పెట్టారని విమర్శించారు. దీన్ని పేపర్ లీక్ అనరని, మాల్ ప్రాక్టీస్ అంటారని చెప్పారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశం నుంచి జనాల దృష్టిని మళ్లించేందుకే పదో తరగతి పేపర్ లీక్ అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. చట్టం, పోలీసు వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు.