కారుపై పొరపాటున పడిన ఉమ్ము.. బెల్టుతో చితకబాది వీరంగం!
- విజయవాడలో ఘటన
- కారుపై ఉమ్ము పడడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకుడు
- బైకర్‌ను రక్షించే ప్రయత్నం చేసిన వారిపైనా వీరంగం
- కారు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
బైక్‌పై వెళ్తున్న యువకుడు రోడ్డుపై ఉమ్మి వేస్తే గాలికి అది వెనక వస్తున్న కారుపై పడింది. అంతే, కారులోంచి దిగిన యువకుడు నడుముకున్న బెల్టు తీసి బైకర్‌ను విచక్షణ రహితంగా చితకబాదాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ఇతరులనూ బెదిరించాడు. విజయవాడలో జరిగిందీ ఘటన.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పటమటకు చెందిన గోవిందరాజు మంగళవారం రాత్రి 11.45 గంటల సమయంలో బైక్‌పై రామవరప్పాడు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో లబ్బీపేటకు చెందిన కొండపల్లి నిఖిల్ కారులో అదే మార్గంలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోవిందరాజు రమేశ్ ఆసుపత్రి కూడలి సమీపంలో ఉమ్మి వేశాడు. అయితే, గాలికి అది వెనక వస్తున్న కారుపై పడింది. దీంతో కారు ఆపి కోపంతో కిందికి దిగిన నిఖిల్ బెల్టుతో గోవిందరాజును చితకబాదాడు. అక్కడితో ఆగకుండా అతడి ఫోన్‌తోపాటు బైక్ కీని లాక్కున్నాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు నిఖిల్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపైనా తిరగబడ్డాడు.
అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికొచ్చి ఇద్దరినీ స్టేషన్‌కు తరలించారు. నిఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.