మామపై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు: పేర్ని నాని…
- విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు
- పరస్పరం విమర్శలు చేసుకుంటున్న బీఆర్ఎస్, వైసీపీ నేతలు
- ఏపీ మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నారన్న హరీశ్ రావు
- మామా అల్లుళ్ల తగాదాలే ఈ విమర్శలకు కారణమన్న పేర్ని నాని
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వ్యవహారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిచ్చు రేపింది. బీఆర్ఎస్, వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలతో పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఎక్కువగా మాట్లాడుతున్నారు… అంత మంచిది కాదు అంటూ హరీశ్ రావు ఏపీ మంత్రులకు ఘాటు హెచ్చరిక చేశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇదేంటని నిలదీసేవాళ్లే లేరని విమర్శించారు. అసలు, ఏపీలో ఏముందని అంటూ ఎద్దేవా చేశారు. రోడ్ల పరిస్థితి దారుణమని అన్నారు.
దీనిపై ఏపీ మంత్రులు పలువురు తీవ్రంగా స్పందించారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మామ కేసీఆర్ పై ఎప్పుడు కడుపు రగిలినా హరీశ్ రావు మమ్మల్ని తిడతాడు అంటూ వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ ను ఏమీ చేయలేక మనల్ని కెలుకుతుంటాడు… రాజకీయాల్లో హరీశ్ రావుది పదునైన బుర్ర. నాతో చాకిరీ చేయించుకుంటున్న కేసీఆర్… కొడుకును, కూతురిని అభివృద్ధి చేసుకుంటున్నాడు… తన పరిస్థితి ఏంటా అని హరీశ్ రావు లోపల్లోపల కుతకుతలాడి పోతుంటాడు. పైకి మాత్రం ఫుల్లుగా యాక్షన్ చేస్తుంటాడు… మామయ్యా, మామయ్యా అంటుంటాడు. రామారావును చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచేందుకు ఎదురుచూస్తున్నాడు. కేసీఆర్ తనను పట్టించుకోవడంలేదని హరీశ్ కు కోపం” అని పేర్ని నాని ధ్వజమెత్తారు.
మామా అల్లుళ్ల తగాదాలే ఈ విమర్శలకు కారణం అని పేర్కొన్నారు. “కేసీఆర్ ను నేరుగా తిట్టలేక మనల్ని విమర్శిస్తుంటాడు. అప్పుడు మనం హరీశ్ ను తిట్టకుండా ప్రభుత్వాధినేత అయిన కేసీఆర్ నే కదా తిడతాం… హరీశ్ కు కావాల్సింది అదే. తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూద్దామా? ఎంతసేపు హైదరాబాదులో, సిద్ధిపేటలోనే చూస్తే సరిపోతుందా? తెలంగాణలో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా! మాక్కూడా తెలంగాణలో ఫ్రెండ్స్ ఉన్నారు… ఈ మామా అల్లుళ్లతో చస్తున్నాం రా బాబూ అంటున్నారు. అసలు, హైదరాబాదులోనే సరిగా రోడ్లు లేని ప్రాంతాలకు తీసుకెళతాను పద.
మీ మామను తిట్టించాలంటే మమ్మల్ని కెలకడం ఎందుకు? హరీశ్ రావు వలస కార్మికులను తెలంగాణలో ఓట్లు నమోదు చేయించుకోమంటున్నాడు… మరి, ఏపీపై అంత ప్రేమ ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎందుకు అడ్డుకున్నారు? నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే రకం కేసీఆర్… మళ్లీ మామను తిట్టకపోతే హరీశ్ రావు ఫీలవుతాడు. కేసీఆర్ ను మనం తిడతామని ఆయన ఎంతో నమ్మకంతో మనల్ని కెలికాడు… కేసీఆర్ ను మనం తిట్టకపోతే ఎలా?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దొంగ ప్రాజెక్టు అయితే… డిండి, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లు దొంగతనంగా పెట్టుకున్నట్టు కాదా. మీ ప్రజలపై మీకెలా ప్రేమ ఉందో మా ప్రజలపై మాకు అలాగే ప్రేమ ఉంది. ఈ సందర్భంగా హరీశ్ రావుకు చెప్పేదొక్కటే… మీ మామపై మీకు ఎప్పుడు కోపం వచ్చినా, ఆయనను ఎప్పుడు బూతులు తిట్టించాలని భావించినా మమ్మల్ని గిల్లితే చాలు… మీ కోరిక ప్రకారం కేసీఆర్ ను తిట్టడానికి సదా మేం సిద్ధంగా ఉంటామని ప్రేమపూర్వకంగా చెబుతున్నాం” అని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు.