ఏపీలో అత్యంత ధనవంతుడు, దేశంలో మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు!
- చంద్రబాబుకు రూ. 668 కోట్ల ఆస్తులు
- ముఖ్యమంత్రులలో రూ.510 కోట్ల ఆస్తులతో తొలి స్థానంలో జగన్
- వెల్లడించిన ఏడీఆర్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. మొత్తం రూ.668 కోట్ల సంపదతో ఏపీలో అందరికంటే ధనవంతుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. అంతేకాదు దేశం మొత్తంలో మూడో ధనిక ఎమ్మెల్యేగానూ నిలిచారు. ఈ మేరకు ఏడీఆర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దేశంలో అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యేగా కర్ణాటకకు చెందిన ఎన్ నాగరాజు నిలిచారు. ఆయన సంపద 1015 కోట్ల రూపాయలు. అదే రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 840 కోట్లుగా ఉంది. కాగా, దేశంలో అత్యధిక ధనవంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో రూ. 510 కోట్ల సంపదతో ఆంధప్రదేశ్ సీఎం జగన్ మొదటి స్థానంలో ఉన్నట్టు ఏడీఆర్ ఇటీవలే నివేదించింది.