ఎడమకాలిలో సమస్య ఉంటే కుడికాలికి వైద్యుడి ఆపరేషన్!
- హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
- ఎడమకాలిలో సమస్య, రోగికి కుడికాలికి వైద్యుడి ఆపరేషన్
- వైద్యుడిపై డీఎంహెచ్‌ఓకు రోగి కుటుంబసభ్యుల ఫిర్యాదు
- ఆరు నెలల పాటు వైద్యుడి గుర్తింపు రద్దు
విధి నిర్వహణలో వైద్యుల నిర్లక్ష్యం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. హైదరాబాద్‌లో తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కరణ్ ఎం. పాటిల్ ఆర్థోపెడిక్ సర్జన్. ఇటీవల ఆయన తన వద్దకు వచ్చిన ఓ రోగికి ఎడమకాలికి చేయాల్సిన శస్త్రచికిత్స కుడికాలికి చేశారు. రెండు రోజుల తరువాత తప్పును గుర్తించిన ఆయన పేషెంట్‌ను మళ్లీ పిలిపించుకుని ఎడమకాలికి ఆపరేషన్ చేశారు.
డాక్టర్ భారీ తప్పిదానికి పాల్పడ్డట్టు గుర్తించిన రోగి కుటుంబసభ్యులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై అధికారుల విచారణలో కరణ్ తప్పు చేసినట్టు తేలింది. దీంతో అధికారులు కరణ్.ఎం.పాటిల్ గుర్తింపును ఆరు నెలల పాటు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. తన సర్టిఫికేట్లను వైద్య మండలికి అందజేయాలని కూడా ఆదేశించారు.