యూపీలో తుపాకుల పాలన కొనసాగుతోంది: అసదుద్దీన్ మండిపాటు !
- రాజ్యాంగంపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించిన ఎంఐఎం నేత
- అతీక్, అష్రాఫ్ ల హత్యలో యూపీ ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపణ
- హత్యపై సుప్రీంకోర్టు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్ లో శనివారం రాత్రి గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హత్యకు గురైన విషయం తెలిసిందే! పోలీసుల సమక్షంలోనే మీడియా ప్రతినిధుల వేషంలో వచ్చిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. దీంతో అతీక్, అష్రాఫ్ లు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం స్పందించారు. యూపీలో తుపాకుల పాలన కొనసాగుతోందని యోగి సర్కారుపై మండిపడ్డారు. ఇలాంటి తీవ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పోలీసుల సమక్షంలోనే హంతకులు కాల్పులు జరపడంపై అసదుద్దీన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరిగాక దేశంలో రాజ్యాంగం, శాంతిభద్రతలపై ప్రజల్లో నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ దారుణంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ కమిటీలో యూపీకి చెందిన అధికారులకు చోటివ్వకూడదని అన్నారు. తనకు భయంలేదని, తప్పకుండా ఉత్తరప్రదేశ్ కు వస్తానని, చనిపోవడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.