పొంగులేటిని రాహుల్ టీమ్ కలిసిందా….?
-పొంగులేటితో ఆరుగురు సభ్యుల రాహుల్ టీం చర్చలు జరిపిందా…
-పొంగులేటి ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు అడిగారా …
-పొంగులేటి ప్రతిపాదనలపై భట్టి ,రేణుక చౌదరి అసహనం వ్యక్తం చేశారా..
-గ్రేటర్ హైద్రాబాద్ లోని సికింద్రాబాద్ కొంటోన్మెంట్ సీటు కూడా అడిగారా…! .
ఇటీవలనే బీఆర్ యస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ దూతలు కలిశారని ఆయన తో 6 గంటలకు పైగా చర్చలు జరిపారని వార్త కథనాల సారాంశం …అయితే ఇందులో నిజమెంత అంటే ప్రస్నార్ధకమే … అసలు చర్చలు జరిగాయనే వార్తల్లో నిజం లేదని విశ్వసనీయ సమాచారం … రాహుల్ బృందమే రాలేదని తెలుస్తుంది. వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయి ఎవరు పుట్టించారనే దానిపై చర్చలు మాత్రం విఫరీతంగా జరుగుతున్నాయి. అనేక ఛానళ్ళకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో తనకు బీజేపీ , కాంగ్రెస్ లనుంచి ఆహ్వానాలు ఉన్నాయని అయితే తనను నమ్ముకున్న కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు కుండబద్దలు కొడుతున్నారు. తన లక్ష్యం ఒక్కటే జిల్లా నుంచి బీఆర్ యస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ తాకకుండా చూడటం , కేసీఆర్ మరోసారి సీఎం కాకుండా అడ్డుకోవడమని తన మనసులో మాట చెబుతున్నారు . కొందరు మాత్రం హైద్రాబాద్ లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కొనుగోలు శ్రీనివాస్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేశారని సమాచారం …అయితే అది జరిగిందా లేదా అనేది నిర్దారణ కాలేదు …
పొంగులేటి తో రాహుల్ బృందం జరిపిన చర్చల్లో జిల్లాలో 9 సీట్లు అడిగారని , ఒక్క మధిర మినహా తమ అభ్యర్థులనే పెడతామని అన్నారని ప్రచారం జరుగుతుంది. వీటితోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కూడా తమకు కావాలని పొంగులేటి కోరారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ససేమీరా అంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. పొంగులేటిని ముందు పార్టీలో చేరమనండి తర్వాత సీట్ల సంగతి ఆలోచిద్దామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆరా తీస్తున్నాయి.
దీనిపై పొంగులేటి క్యాంపు కార్యాలన్నీ సంప్రదించగా రాహుల్ బృందంతో పొంగులేటి ఎలాంటి చర్చలు జరపలేదని కొట్టి పారేశారు . ఎవరు తమను సంప్రదించలేదని ,ఇక చర్చలు జరపడం ఎక్కడిదని వారు అంటున్నారు . ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు .