Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ వైఫల్యమే బిజెపి ఎదుగుదల కారణం …సిపిఐ పోరు యాత్రలో వక్తలు …

కాంగ్రెస్ వైఫల్యమే బిజెపి ఎదుగుదల కారణం …సిపిఐ పోరు యాత్రలో వక్తలు …
శత్రువు బలవంతుడు ఐక్యగా పోరాడాలి …మంత్రి అజయ్
సిపిఐ కి జాతీయ హోదా తొలగింపు వెనక బీజేపీ కుట్ర …మంత్రి అజయ్
కాషాయం కప్పుకుంటే పవిత్రులా: కూనంనేని
దేశ రక్షణ బాధ్యత కమ్యూనిస్టులదే: పోతినేని

ప్రశ్నించే వారు జైళ్లలో మగ్గుతున్నారని చట్టం ముసుగులో హింసాత్మక చర్యలకు గురవుతున్నారని కానీ దోపిడీదారులు మాత్రం బిజెపిలో చేరి నాయకులుగా చెలామణి అవుతున్నారని సిపిఐ, బిఆర్ఎస్, సిపిఎం నాయకులు ఆరోపించారు. వామపక్ష ప్రగతిశీల శక్తులు ముఖ్యంగా బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం సమైక్యంగా పోరాడి ఉమ్మడి జిల్లాలో విజయ దుందుభి మ్రోగించాలని పిలుపునిచ్చారు. సిపిఐ చేపట్టిన ప్రజా పోరుయాత్రలో భాగంగా గురువారం ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఎస్కె జానిమియా అధ్యక్ష తన జరిగిన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ బిజెపిని అడ్డుకోవడమే బిఆర్ఎస్ ఎజెండా అన్నారు. దేశంలో రాష్ట్రంలో బిజెపికి అధికారం దక్కకూడదనే లక్ష్యంతోనే బిఆర్ఎస్ పని చేస్తుందన్నారు. స్వార్ధం లేని కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఇప్పుడు దేశ రక్షణ ప్రధాన సమస్యగా మారడంతో దేశాన్ని రక్షించేందుకు సిపిఐ ప్రజాపోరు యాత్ర చేపట్టిందని యాత్రకు బిఆర్ఎస్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తుందన్నారు. శత్రువు బలవంతుడైనప్పుడు ఐక్యంగా పోరాడాలని బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలు ఆ దిశగా పని చేస్తున్నాయన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను న్యాయస్థానాలు విడుదల చేయడం సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని మందలించడాన్ని చూస్తుంటే న్యాయస్థానాలు సైతం ప్రభావితం అవుతున్నాయన్న భావన కలుగుతుందన్నారు. గోద్రా ఘటనలో దోషులుగా ఉన్న వారు ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని మంత్రి ఆరోపించారు. సిపిఐకి జాతీయ హోదా తొలగింపు వెనక బిజెపి కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్టం చేశారు. సిబిఐ, ఈడీలు ప్రభుత్వ తొత్తుగా మారాయని దురదృష్టవశాత్తు ఎలక్షన్ కమిషన్ కూడా అదే బాటలో ఉండడం ప్రజా స్వామ్యానికి ప్రమాదమన్నారు. మోదీ అధికారంలోకి రాగానే ధనా ధన్ రూ. 15 లక్షలు వేస్తానని, ధనా ధన్ ఖాతాలు తెరవండి అని చెప్పి ఐదు పైసలు కూడా చెయ్యలేదని ఆయన తెలిపారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంస్థలను తెగనమ్ముతున్నారని అజయ్ తెలిపారు. అంబానీ లాంటి వ్యక్తుల కారణంగా ఎస్ఐసి, ఎస్ఐ లాంటి సంస్థలు నష్టపోయాయన్నారు. ఖమ్మంజిల్లాలో మూడు పార్టీలు ఐక్యంగా పని చేసి అద్భుత విజయాలను సాధించనున్నాయని అజయ్ అన్నారు.

కాషాయం కప్పుకుంటే పవిత్రులా: కూనంనేని

విపక్షాలలో ఉంటే దోషులు, కాషయం కప్పుకుంటే పవిత్రులా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఆర్థికంగా అడ్డదారిన ఎదిగిన వారికి బిజెపి కండువాలు కప్పుతుందన్నారు. దోపిడీదారులంతా బిజెపిలో చేరుతున్నారని ఆయన తెలిపారు. దేశానికి బిజెపి క్యాన్సర్ కంటే ప్రమాదముని అందుకే బిజెపి ప్రమాదాన్ని గుర్తించి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరుస్తూ సిపిఐ ముందుకు సాగుతుందన్నారు. కమ్యూనిస్టులను విమర్శించే వ్యక్తులు కమ్యూనిస్టుల త్యాగాల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. ఇప్పటి కమ్యూనిస్టులు, అప్పటి కమ్యూనిస్టులకు వారసులేనని ఆ పోరాట పంథానే కొనసాగిస్తున్నారని ఎవరో ఒకరి రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా కమ్యూనిస్టులు నడుచుకోరని ఈ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. నిన్న, మొన్న తెలియనోళ్లు ఊసరవెల్లిని మించి రంగులు మార్చేవాళ్లు కమ్యూనిస్టులను విమర్శిస్తుంటారని దమ్ముంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్లో గెలవాలని సాంబశివరావు సవాల్ విసిరారు. ఆర్ధిక మాఫియాకు వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతుందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బిజెపి గౌరవించడం లేదని, మను ధర్మాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. గాడ్సేకు గుడి కట్టించిన బిజెపి ఆ పార్టీ ఎంఎలి రామునితో పాటు గాడ్సేను ఊరేగించిన పట్టించుకో లేదని న్యాయస్థానం సైతం స్పందించ లేదని సాంబశివరావు తెలిపారు. భారతదేశంలో ప్రజా అనుకూల చట్టాలన్ని కమ్యూనిస్టుల పోరాట ఫలితమే అన్నారు. కమ్యూనిస్టుల ఐక్య పోరాటం మున్ముందు కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

దేశ రక్షణ బాధ్యత కమ్యూనిస్టులదే: పోతినేని

దేశ రక్షణ బాధ్యత కమ్యూనిస్టులదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. దేశం విచ్ఛిన్నకర పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపిని నిలువరించి దేశాన్ని రక్షించేందుకు కమ్యూనిస్టులు నడుం బిగించారని ఆయన తెలిపారు. బిజెపికి ఒక్కసారి అధికారమిస్తే తెలంగాణలో ఏమి జరుగుతుందో బండి సంజయ్ తెలిపారని రూ.500 కోట్లతో నిర్మించిన సచివాలయాన్ని కూల్చేయడం, మసీదులను కూల్చేయడమేనని ఆయన తెలిపారని విశ్వాసాల పునాదుల పైన మసీదులు నిర్మించబడ్డాయన్న వాస్తవాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతుందన్నారు. మసీదు కూల్చి శివలింగాలు ఉంటే ఉంచుకుని శవాలు ఉంటే ఇచ్చేస్తారని చెబుతున్న బిజెపిని అడ్డుకోవడమే మా ఎజెండా అని పోతినేని స్పష్టం చేశారు. మనదైన పోరాట మార్గంలో ముందుకు సాగుతామని, కమ్యూనిస్టులు ఐక్యంగానే పోరాడతారని ఎన్ కౌంటర్లు, బుల్డోజర్ల ప్రభుత్వానికి తగు సమాధానం చెబుతామని ఆయన తెలిపారు. ఈసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, యర్రాబాబు, కె. గోవిందరావు, ఏపూరి లతాదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు, కార్పొరేటర్ వెంకటనారాయణ, నాయకులు ఏనుగు గాంధీ, సాంబశివారెడ్డి, లక్ష్మీ నారాయణ, ఎండి జాకీర్, వీరన్న, సిపిఎం నాయకులు జబ్బార్, మీరా తదితరులు పాల్గొన్నారు.

Related posts

పవన్ డ్రామాలు సినిమాలో చేసుకో ప్రజలవద్ద కాదు ..పేర్నినాని ఫైర్ …

Drukpadam

చంద్రబాబు కుట్రలో భాగమే రాష్ట్రపతికి లేఖ :ఎంపీ మిధున్ రెడ్డి…

Drukpadam

అధికారులు, అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌ధ్య తోపులాట‌..

Drukpadam

Leave a Comment