హైదరాబాదులో 8 ఏళ్ల బాలుడి దారుణ హత్య.. అమావాస్య నాడు బలిచ్చారంటూ ఆరోపణ…
- సనత్‌నగర్ పారిశ్రామికవాడలో వెలుగుచూసిన ఘటన
- చిట్టీలు నడిపే వ్యక్తితో గురువారం గొడవపడ్డ స్థానిక వ్యాపారి
- అదే రోజు వ్యాపారి కుమారుడి అదృశ్యం, పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
- బాలుడు కిడ్నాప్ అయినట్టు దర్యాప్తులో వెల్లడి, పోలీసుల అదుపులో నిందితులు
- బాలుడిని హత్య చేసినట్టు నిందితుల అంగీకారం
- నరబలి కోసం బాలుడిని హత్య చేశారని స్థానికుల ఆరోపణ
హైదరాబాద్ నగరంలో అమావాస్య రోజున జరిగిన ఓ బాలుడి హత్య స్థానికంగా కలకలానికి దారి తీసింది. బాలుడిని నరబలి ఇచ్చారన్న ఆందోళ స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్ పారిశ్రామికవాడలో వసీంఖాన్ అనే వ్యక్తి ఓ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి 8 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. బాలుడి పేరు వాహిద్. కాగా..ఫిజాఖాన్ అనే హిజ్రా వద్ద చిట్టీ వేసిన వసీంఖాన్ తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాలంటూ గురువారం అతడితో గొడవపడ్డాడు. ఆ సాయంత్రమే వసీంఖాన్ కుమారుడు కనపించకుండా పోయాడు.
దీంతో, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు వాహిద్‌ను నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఆ ఆగంతుకులు బాలుడిని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఫిజాఖాన్ ఇంటికి వెళ్లినట్టు కనిపెట్టి చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాము బాలుడిని హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు. బాలుడి మృతదేహాన్ని ఓ నాలాలో వేసినట్టు తెలిపారు. ఈ సమాచారంతో అక్కడికి వెళ్లి చూసిన పోలీసులకు బాలుడి శవం లభించింది. హత్య అనంతరం బాలుడి ఎముకలను విరిచి బ్యాగులో కుక్కి అక్కడ పడేసినట్టు తేలింది.
అయితే.. బాలుడిని నరబలి ఇచ్చారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారు నిందితుడు ఫిజాఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. గురువారం అమావాస్య రోజున క్షుద్రపూజలు చేసి బాలుడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించాయని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.