సెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అనేది అసత్య ప్రచారం: ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ…
- కొత్త సచివాలయం నుంచి నీరు నిలిచిందంటూ వీడియో వైరల్
- అది నిజం కాదని తేల్చిన ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ
- ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30న లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 1600 కోట్ల రూపాయల ఖర్చుతో కట్టిన సచివాలయ సముదాయం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ఈ సచివాలయం విషయంలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పైకప్పు నుంచి నీరు లీక్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో అవాస్తవం అని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వ కార్యక్రమాలపై వచ్చే తప్పుడు సమాచారాన్ని తనిఖీ చేసే ట్విట్టర్ హ్యాండిల్ ‘ఫ్యాక్ట్ చెక్’ ప్రకటించింది. నీరు లీక్ అవుతున్నది సెక్రటేరియట్ నుంచి కాదని, దాని ప్రాంగణంపై నిలిచిన నీరు అని తెలిపింది.
‘తెలంగాణ సెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఒక వీడియో ప్రజలని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉంది. వీడియోలో కనిపించేది నూతన సచివాలయం బయట నిర్మాణంలో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కాంప్లెక్స్ పై నీరు నిలిస్తే దాన్నిసెక్రటేరియట్‌పై నీరు నిలిచింది అని వీడియోలో అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి’ అని ట్వీట్ చేసింది.