Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

  • బ్రిటన్ రాణి మృతితో రాజుగా నియమితుడైన చార్లెస్-3
  • నేడు అధికారికంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం
  • 1953 తర్వాత బ్రిటన్ లో తొలిసారి పట్టాభిషేకం
  • 2 వేల మంది అతిథుల హాజరు
  • పట్టాభిషేకానికి విచ్చేసిన పలు కామన్వెల్త్ దేశాల ప్రధానులు, అధ్యక్షులు

బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాచరికపు లాంఛనాలతో అధికారికంగా నిర్వహించింది. 1953 తర్వాత బ్రిటన్ లో పట్టాభిషేకం జరగడం ఇదే ప్రథమం. దాంతో యావత్ ప్రపంచం చార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవంపై ఆసక్తి చూపింది. అందుకు తగ్గట్టుగానే ఈ కార్యక్రమం బ్రిటన్ రాచరికపు వైభవం ఉట్టిపడేలా సాగింది.

ఈ వేడుకలో బ్రిటన్ రాజుగా చార్లెస్-3కి కిరీట ధారణ చేశారు. ఆయన అర్ధాంగి కెమిల్లా పార్కర్ కూడా రాణిగా కిరీటం ధరించారు. అనేక కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఈ పట్టాభిషేకానికి హాజరయ్యారు. 2 వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

మొదట… చార్లెస్, కెమిల్లా పార్కర్ దంపతులు బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబేకు పయనమయ్యారు. అశ్వ దళాలు, సాయుధ గార్డులు ముందు నడవగా రాజ దంపతులు వెస్ట్ మినిస్టర్ అబేకు చేరుకున్నారు. కాంటర్ బరీ ఆర్చ్ బిషప్ కింగ్ చార్లెస్ ను అందరికీ పరిచయం చేశారు… ఆపై కిరీట ధారణ చేశారు.

ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బైబిల్ లోని కొన్ని వాక్యాలను చదవగా… చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని చార్లెస్-3 ప్రమాణం చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ కు అత్యంత నమ్మకస్తుడైన ప్రొటెస్టెంట్ గా ఉంటానని మరో ప్రమాణం చేశారు.

పట్టాభిషేక కార్యక్రమంలో భాగంగా, 1300వ సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ తయారు చేయించిన సింహాసనాన్ని చార్లెస్ అధిష్ఠించారు. వెంటనే ఆయనను ఆర్చ్ బిషప్ పవిత్ర తైలంతో అభిషేకించారు. ఈ ఘట్టం ముగిసిన తర్వాత చార్లెస్ కు బంగారు తాపడం చేసిన రాచరికపు గౌన్ తొడిగి కూర్చోబెట్టారు. ఆయనకు ఆర్చ్ బిషప్ సిలువతో కూడిన గోళాకారంలో ఉండే రాజముద్ర, రాజదండం అందించారు.

ఇక, చార్లెస్-3 ధరించిన కిరీటం 1661లో తయారైంది. దీని బరువు 2.23 కిలోలు. పట్టాభిషేకం సమయంలో కేవలం గంట పాటు మాత్రమే దీన్ని ధరిస్తారు. కిరీట ధారణ సమయంలో ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులంతా గాడ్ సేవ్ కింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజ ఖడ్గాన్ని చేతబూనిన చార్లెస్-3 కిందికి దిగివచ్చి ప్రత్యేకంగా రూపొందించిన సింహాసనంపై కూర్చుని కనువిందు చేశారు.

కొంతకాలంగా బ్రిటన్ రాజకుటుంబానికి దూరంగా ఉంటున్న యువరాజు హ్యారీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన భార్య మేఘాన్ మోర్కెల్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.

Related posts

యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ముగిసిన పోలింగ్!

Drukpadam

దేశంలో మరో ఎయిర్ లైన్స్ సంస్థ… ‘ఆకాశ ఎయిర్’ కు డీజీసీఏ పచ్చజెండా!

Drukpadam

వ్యవసాయ కూలీలకు దిశానిర్దేశం చేయనున్న ఖమ్మం సభలు!

Drukpadam

Leave a Comment