ఓటమి భయంతో… ప్రచారానికి దూరంగా ఉంటున్న వ్యక్తిని కూడా తీసుకువచ్చారు: మోదీ
- కర్ణాటకలో మే 10న ఎన్నికలు
- కాంగ్రెస్ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న సోనియా గాంధీ
- 2019 తర్వాత సోనియా ప్రచారం చేయడం ఇదే ప్రథమం
- అబద్ధాలతో ప్రయోజనంలేదని కాంగ్రెస్ వాళ్లకు అర్థమైందన్న మోదీ
మరో మూడ్రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇవాళ శివమొగ్గలో నిర్వహించిన బీజేపీ సభలో మోదీ ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగడంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో, ప్రచారానికి దూరంగా ఉంటున్న వ్యక్తి (సోనియా)ని సైతం ప్రచారానికి తీసుకువచ్చారని కర్ణాటక కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెబితే ఎంతమాత్రం ప్రయోజనం లేదని కాంగ్రెస్ వాళ్లకు అర్థమైందని అన్నారు. ఇప్పటికే ఓటమికి బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకోవడం కాంగ్రెస్ నేతల్లో మొదలైందని మోదీ వ్యాఖ్యానించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సోనియా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అనారోగ్యానికి గురైన సోనియా 2019 తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. ఆమె నిన్న హుబ్బళ్లిలో ఎన్నికల సభలో పాల్గొన్నారు.
పలు సర్వేలు తమకు అనుకూలంగా ఉండడంతో కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.