బెంగళూరు సిటీ బస్సులో రాహుల్ గాంధీ.. మహిళా ప్రయాణికులతో ముచ్చట!
- నిన్న స్కూటీపై వెళ్తూ.. ఈ రోజు బస్సులో ప్రయాణిస్తూ రాహుల్ గాంధీ ప్రచారం
- నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చ
- బస్టాండ్ లోనూ కాలేజీ స్టూడెంట్లు, మహిళలతో మాట్లాడిన కాంగ్రెస్ నేత
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో కొత్త పంథాలో సాగుతున్నారు.
సభలు, సమావేశాలు, రోడ్ షోలతోపాటు నేరుగా జనంలోకి రాహుల్ వెళ్తున్నారు. నిన్న స్కూటీపై డెలివరీ బాయ్ తోపాటు వెళ్లి ప్రచారం నిర్వహించిన రాహుల్.. ఈ రోజు బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రాహుల్ గాంధీ తొలుత కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. తర్వాత బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ స్టాప్ కు వెళ్లారు. కాలేజీ స్టూడెంట్లు, మహిళా ఉద్యోగులతో మాట్లాడారు.
తర్వాత బస్సులో ప్రయాణించారు. మహిళలు, కాలేజీ విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి (మహిళలకు నెలకు రూ.2 వేలు ఇచ్చే పథకం), బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ తదితర అంశాలపై వారితో చర్చించారు. తర్వాత లింగరాజపురం వద్ద రాహుల్ బస్సు దిగారు. అక్కడ స్టాప్ లో ఉన్న వారితోనూ రాహుల్ మాట్లాడారు.