మా నాన్నే ముఖ్యమంత్రి కావాలి.. సిద్ధరామయ్య కొడుకు కామెంట్..!
- కర్ణాటక ప్రయోజనాల కోసం సిద్ధరామయ్యే సీఎం కావాలన్న యతీంద్ర
- బీజేపీ హయాంలో జరిగిన అవినీతిని ఆయనే సరిచేస్తాడని వ్యాఖ్య
- కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ దిశగా ఫలితాలు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ దాదాపు మెజార్టీ సాదించబోతుంది. ఆపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం …అయితే ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ముఖ్యనేతలు సీఎం సీటు కోసం పోటీపడుతున్నారు . వారిలో మాజీ సీఎం సిద్దరామయ్య , కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారు. ఎవరిని సీఎం చేయాలనేది కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని ఇద్దరు పైకి చెపుతున్నప్పటికీ ఎవరికీ వారు తామే కావాలని కోరుకుంటున్నారు . సిద్దరామయ్య కుమారుడు మా నాన్నే ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు . సిద్దరామయ్య ఎన్నికైన ఎమ్మెల్యేలు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తారని నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు . శివకుమార్ మాత్రం అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు సీఎం అవుతారని అంటున్నారు . ఇది అధిష్టానానికి పెద్ద చిక్కుముడిగానే ఉంటుంది ..
ఓ కొడుకుగా, కన్నడ పౌరుడిగా నా తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని యతీంద్ర వివరించారు. గతంలో ఆయన సుపరిపాలన అందించారని, ఈసారి కూడా రాష్ట్రాన్ని బాగా పాలిస్తారని అన్నారు. బీజేపీ పాలనలో జరిగిన అవినీతిని సరిచేస్తారని, రాష్ట్ర ప్రయోజనాల కోణంలో చూసినా ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనే కోరుకుంటామని యతీంద్ర తెలిపారు. కాగా, ప్రస్తుతం వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో క్లియర్ మెజారిటీ దిశగా కాంగ్రెస్ దూసుకెళుతోంది.
కర్ణాటక ఫలితాలపై సిద్ధరామయ్య స్పందన..
- సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి
- 120 సీట్లకు పైగా గెలుచుకుంటామని వెల్లడి
- బీజేపీపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్న కాంగ్రెస్ సీనియర్ నేత
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 122 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్టీకి క్లియర్ మెజారిటీ వస్తుందని స్పష్టం కావడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలో 120 స్థానాలకు పైగా గెలుచుకుంటామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని చెప్పారు. బీజేపీపై, ఆ పార్టీ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పనిచేయలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.