Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తల్లి అంత్యక్రియల కోసం పోటీపడిన హిందూ కుమారుడు, ముస్లిం కుమార్తె…

తల్లి అంత్యక్రియల కోసం పోటీపడిన హిందూ కుమారుడు, ముస్లిం కుమార్తె… మ్యాటర్ సెటిల్ చేసిన హైదరాబాద్ పోలీసులు 

  • మాదన్నపేట్ లో 95 ఏళ్ల వృద్ధురాలి మృతి
  • 20 ఏళ్ల కిందట ఇస్లాం మతంలోకి వెళ్లిన కుమార్తె
  • ఇస్లాం ప్రకారం అంత్యక్రియలు జరిపించాలన్నది తల్లి కోరిక అని కుమార్తె వెల్లడి
  • హిందూ సంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు చేస్తామని పట్టుబట్టిన కొడుకు
  • ఇరువర్గాలకు రాజీ చేసిన పోలీసులు

కుమారుడేమో హిందూ మతం అనుసరిస్తున్నాడు… కుమార్తె ఇస్లాం మతం పుచ్చుకుంది… వీరి తల్లి చనిపోగా, ఆమె అంత్యక్రియలు తాము జరిపిస్తామంటే తాము జరిపిస్తామని కొడుకు, కుమార్తె ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి ఈ పంచాయితీని హైదరాబాద్ పోలీసులు సెటిల్ చేశారు. 

హైదరాబాద్ లోని మాదన్న పేట్ దరాబ్ జంగ్ కాలనీలో నివసించే 95 ఏళ్ల వృద్ధ మహిళ కన్నుమూసింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తన సంతానంతో చాదర్ ఘాట్ లో నివాసం ఉంటున్నాడు. కుమార్తె దాదాపు 20 ఏళ్ల కిందట ఇస్లాం మతం స్వీకరించింది. ఇప్పుడు కుమార్తె వయసు కూడా 60 దాటింది. 

తల్లికి హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించేందుకు కొడుకు ముందుకొచ్చాడు. అయితే, దీనికి కుమార్తె అభ్యంతరం చెప్పింది. ఇస్లాం మతం ప్రకారం అంతిమ సంస్కారాలు జరిపించాలన్నది తన తల్లి కోరిక అని, పైగా గత 12 ఏళ్లుగా ఆమె బాగోగులను తానే చూస్తున్నానని ఆమె వాదించింది. 

ఎవరూ ఆమె ఆలనాపాలనా చూడకపోవడంతో తానే తల్లిని సంరక్షిస్తున్నానని వివరించింది. తన తల్లి కూడా ఇస్లాం మతం స్వీకరించిందని వెల్లడించింది. ఇటీవలే రూ.5 లక్షలతో ఆమెకు శస్త్రచికిత్స కూడా చేయించానని కుమార్తె పేర్కొంది. కుమారుడు కూడా తల్లికి తానే అంత్యక్రియలు నిర్వహిస్తానని పట్టుబట్టాడు.

ఈ నేపథ్యంలో, కుమారుడు, కుమార్తె తరపు వారు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో మాదన్నపేట్ ఏరియాలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. వృద్ధురాలి అంత్యక్రియల వ్యవహారంలో దృష్టి సారించిన పోలీసులు పలు పత్రాలను, వీడియో సాక్ష్యాలను పరిశీలించారు… ఇరువర్గాలతో మాట్లాడారు. అనేక సంప్రదింపుల అనంతరం రాజీ చేశారు.

దీనిపై సౌత్ ఈస్ట్ డీసీపీ రూపేశ్ స్పందించారు. ఇది ఒక కుటుంబ వ్యవహారం అని, సమస్య పరిష్కారం అయిందని వెల్లడించారు. కుమార్తె నివాసం వద్ద అంతిమ ప్రార్థనలు నిర్వహించాలని, అనంతరం వృద్ధురాలి భౌతికకాయాన్ని కుమారుడికి అప్పగించాలని తీర్మానించినట్టు వివరించారు. ఈ ప్రతిపాదనలకు కుమార్తె, కుమారుడు అంగీకరించారని డీసీపీ తెలిపారు.

Related posts

ఖమ్మం జిల్లా వార్తలు …..

Drukpadam

జర్నలిస్ట్ లకు అండగా ఉంటా…మంత్రి అజయ్!

Drukpadam

అమెరికాలో టిక్‌టాక్‌, వీచాట్‌ డౌన్‌లోడ్ల నిలిపివేత ఉత్తర్వుల ఉపసంహరణ!

Drukpadam

Leave a Comment