ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త …పువ్వాడ వర్సెస్ పొంగులేటి…
-ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పొంగులేటి వర్గ యువనేతపై మంత్రి అనుచరుల దాడి
-మధిర లో పొంగులేటి క్యాంపు ఆఫీస్ పై దాడి
-దాడిఘటనపై పొంగులేటి స్పందన …వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నానని వ్యాఖ్య …
-రానున్న కాలమే అన్నిటికి పరిస్కారం చెపుతుందన్న పొంగులేటి
-మధిర ఆఫీస్ పై దాడి పిరికి పందల చర్య అన్న కోట రాంబాబు
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం కలిగిన వ్యక్తి…మాజీ ఎంపీ పొంగులేటి
ఖమ్మం / కొత్తగూడెం, ముద్ర : రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు…. దేశం యావత్తు గర్వించదగ్గ మహానీయుడు… మహానుభావుడు నందమూరి తారక రామారావు అని మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కార్ల ర్యాలీతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పొంగులేటి పాల్గొన్నారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి, దమ్మపేట, పాల్వంచ, మణుగూరు తదితర ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వర్గ నేతలు స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, డాక్టర్ కోటా రాంబాబు, పాలేరు నియోజకవర్గ నాయకులు శివరామకృష్ణ, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్ తదితరులు ఉన్నారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమూడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆదివారం ఖమ్మం ప్రభుత్వ పీజీ కళాశాల కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు , ఆయన అభిమానులు , బిఆర్ ఎస్ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులు , బి ఆర్ ఎస్ నేతలు బైక్ ర్యాలీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అక్కడికి కొద్ది దూరంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గీయుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొంగులేటి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్ ను గుర్తించి మంత్రి పువ్వాడ అనుచరులు అతని వద్ద కు వెళ్ళారు. ఇటీవల మంత్రి పువ్వా డ అజయ్ కుమార్ అక్రమాలు, అన్యాయాలపై కార్తీక్ ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ విషయం గుర్తుకు రావడంతో మంత్రి అనుచరులు అతన్ని వెంబడించి కొట్టారు. పోలీసులు అడ్డుకొని వారి నుంచి కార్తీక్ ను కాపాడి, టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పొంగులేటి వర్గీయులు కార్తీక్ ను కిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందజేశారు. అతను జై పొంగులేటి అనడంతోనే దాడి చేసినట్లు మంత్రి వర్గీయులు చెబుతుండగా , నేను విగ్రహానికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని, పొంగులేటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి కోసం వస్తున్నారని సమాచారంతో ముందుగా వచ్చినట్లు తెలిపాడు. ఈ సంఘటన అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కార్తీక్ దాడి పై మీడియా ప్రశ్నించగా వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. రానున్న కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. పొంగులేటి వెళ్లిన తరువాత ఎన్టీఆర్ అభిమాన సంఘం , బి ఆర్ ఎస్ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలు , పసుపు తో శుద్ధి చేశారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పొంగులేటి నివాళి అర్పిస్తుండగా ఇటువంటి సంఘటన జరగటం బాధాకరమని ఆయన వర్గీయులు తెలిపారు.
మధిర లో శనివారం రాత్రి మధిర పొంగులేటి క్యాంప్ కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఫ్లెక్సీలు చించి వేశారు. పూల కుండీలు పగలగొట్టారు. ఆ సమయంలో క్యాంప్ కార్యాలయంలో ఎవరూ లేరు. చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో అగంతకులు పరారయ్యారు. ఇది పిరికిపంద చర్య అని పొంగులేటి వర్గం మధిర ఇంచార్జ్ డాక్టర్ కోటా రాంబాబు విమర్శించారు.