- ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి
- ఇటీవల వరుసగా బీజేపీయేతర సీఎంలను కలిసిన నితీశ్ కుమార్
- వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడేందుకు ప్రయత్నం
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. గత కొన్నిరోజులుగా జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలను నితీశ్ కలుసుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి పోరాటానికి నేతలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో పరస్పరం సాయం చేసుకుంటూ పోటీ చేయాలని నితీశ్ చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రతిపక్షాల భేటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గతేడాది తాను బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశం నలుమూలల నుంచి తనకు అభినందనల సందేశాలు వచ్చాయని నితీశ్ వివరించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలను కలిసినట్లు చెప్పారు. వచ్చే నెల 12న పాట్నాలో విపక్ష నేతల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 16 ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరవుతారని జేడీయూ పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఎన్సీపీ సహా బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి వచ్చేందుకు సమ్మతం తెలిపాయని వివరించారు. దాదాపుగా అన్ని విపక్షాలకు ఆహ్వానం పంపినట్లు బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెలిపారు.