శరద్ పవార్‌కు బెదిరింపులు.. అమిత్ షాకు సుప్రియా సూలే విజ్ఞప్తి!
- పవార్ ను బెదిరిస్తూ గురువారం సందేశాలు వచ్చాయన్న మహిళా ఎంపీ
- పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
- పవార్ దేశ నాయకుడు అని… ఆయన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని స్పష్టత
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు తన తండ్రిని బెదిరిస్తూ ఓ ట్విట్టర్ హ్యాండిల్ లో సందేశాలు కనిపించాయని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. బెదిరింపుల నేపథ్యంలో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై, సదరు ట్విట్టర్ హ్యాండిల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంపై సుప్రియా మీడియాతో మాట్లాడుతూ, గురువారం బెదిరింపు మెసేజ్ వచ్చిందని, పవార్ ను బెదిరిస్తూ అగంతుకులు సందేశం పంపించారని, దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి త్వరితగతిన జోక్యం చేసుకోవాలని కోరారు. శరద్ పవార్ దేశానికి చెందిన నాయకుడు అని, ఆయన భద్రత బాధ్యత కేంద్ర హోంశాఖదే అన్నారు. దీనికి సంబంధించి అమిత్ షా చర్యలు తీసుకోవాలన్నారు. ఇవి నీచ రాజకీయాలకు నిదర్శనం అన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కోరారు.
ఇదిలా ఉండగా, ఉద్ధవ్ థాకరే వర్గం ఎంపీ సంజయ్ రౌత్, ఆయన సోదరుడు సునీల్ రౌత్ కూడా ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. అయితే తమకు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వచ్చాయని సునీల్ రౌత్ చెప్పారు. ‘సంజయ్ రౌత్ కు, నాకు నిన్నటి నుండి చంపేస్తామని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ బెదిరింపు కాల్స్ గురించి తాము రాష్ట్ర హోంశాఖ మంత్రి, ముంబై పోలీస్ కమిషనర్ కు సమాచారం ఇచ్చాం’ అని సునీల్ రౌత్ తెలిపారు.