పని చేయలేకుంటే తప్పుకోండి.. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!
-
పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేసిన చంద్రబాబు
- వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా సిద్ధంగా ఉండాలని సూచన
- తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగేలా చేయాలని దిశానిర్దేశం
- దసరా రోజున మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు వెల్లడి
‘‘నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడడం లేదని అనుకోవద్దు. పని చేయకుంటే గట్టిగానే చర్యలు తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా నాయకులు సిద్ధంగా ఉండాలి. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని సూచించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.
పులివెందులను కొట్టి తీరుతాం: చంద్రబాబు సవాల్
తెలుగుదేశం ఒరిజినాలిటీతో ఉండే పార్టీ అని, వైసీపీ అతుకుల బొంత అని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో గెలవడం వైఎస్సార్ సీపీతో జరిగే పని కాదని, పులివెందులను కొట్టి తీరతామని సవాల్ చేశారు. ‘‘జగన్ 98 శాతం హామీలు అమలు చేయకుండా.. రాష్ట్రాన్ని 98 శాతం లూటీ చేశాడు. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఏపీ పరిస్థితి నార్త్ కొరియాలా తయారవుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలు, రైతులపై విద్యుత్ భారం తగ్గేలా నూతన విధానాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. గతంలోనూ విద్యుత్ ఉత్పత్తి ధరలను తగ్గించామన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నాశనం చేసి ఏడు సార్లు చార్జీలు పెంచేసిందని ధ్వజమెత్తారు. ఇంటి పన్ను, చెత్తపన్ను.. ఇలా అన్నింటినీ పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.