భారత విమానయాన చరిత్రలో ఇండిగో అతిపెద్ద డీల్…
- ఇండిగో 500 విమానాల కొనుగోలుకు నిర్ణయం
- ఇప్పటి వరకు 470 విమానాలతో ఎయిరిండియా డీల్ పెద్దది
- ఇండిగో తాజా నిర్ణయంతో అతిపెద్ద డీల్ గా రికార్డ్
భారత ఏవియేషన్ చరిత్రలో భారీ డీల్. దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో 500 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ నుండి నేరో బాడీ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. టాటాకు చెందిన ఎయిరిండియా సంస్థ ఎయిర్ బస్, బోయింగ్ నుండి 470 విమానాల ఆర్డర్ దేశ విమానయాన చరిత్రలో ఇప్పటి వరకు అతిపెద్ద డీల్. ఇప్పుడు ఇండిగో దీనిని అధిగమించింది.
ఇండిగో ప్రస్తుతం 300 విమానాలను నిర్వహిస్తోంది. ఇదివరకు 480 ఆర్డర్ పెట్టగా, ఇవి డెలివరీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో 2030 – 35 కాలంలో డెలివరీ కోసం మరో 500 విమానాలను ఆర్డర్ పెట్టింది. అంటే రానున్న దశాబ్ద కాలంలో ఇండిగో ఆర్డర్ వెయ్యి విమానాల వరకు ఉంది. ఈ మేరకు కంపెనీ ప్రకటన చేసింది.
తాజాగా ఆర్డర్ పెట్టిన విమానాల్లో ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 ఎక్సఎల్ఆర్ విమానాలు ఉన్నాయి. ఈ డీల్ కు సంబంధించిన ఆర్థిక వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్ విలువ 50 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. దేశీయ విమానయాన రంగంలో ఇండిగో వాటా 56 శాతంగా ఉంది.