ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో సీట్ల కొట్లాట….
–మూడు సీట్లపై రేణుక పట్టు …
–భట్టికి సైతం కొన్ని కమిట్మెంట్స్
–పొంగులేటి చేరికతో జిల్లావైపు అందరి చూపు
–పొంగులేటి ఏ సీటు నుంచి పోటీచేస్తారని ఆరా…
–ఆయన అనుయాయులకు ఎన్ని సీట్లు ఇస్తారోననే ఆసక్తి …
అసలే గ్రూప్ తగాదాలకు , వర్గ వైషమ్యాలకు నిలయంగా ఉన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో రానున్న ఎన్నికల్లో సీట్ల కొట్లాట తలనొప్పిగా మారనున్నదా…? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు …ఇప్పటికి జిల్లాలో సీట్ల కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న నేతలు తమ అనుయాయులకు సీట్లు ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు . ఇందులో రేణుకా చౌదరి అగ్రభాగాన ఉన్నారు .తాను ఏపీలో పోటీచేస్తానని అప్పుడప్పుడు చెపుతూనే ఖమ్మం జిల్లాలో పార్టీని అభివృద్ధి చేయడంలో నిలబెట్టడంలో తన పాత్ర ఉందని అందువల్ల తాను కోరుతున్న స్థానాల్లో తన అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు . ఆమె కోరే సీట్లలో కొత్తగూడెం నుంచి ఎడవల్లి కృష్ణ ,సత్తుపల్లి నుంచి ఇటీవలనే పార్టీలో చేరిన మట్టా దయానంద్ , వైరా నుంచి నుంచి రాంమూర్తి నాయక్ ల పేర్లు ఉన్నాయి. ఇదే సీట్లలో భట్టి సన్నిహితులు పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం , బాలాజీ నాయక్ వైరా నుంచి ఉన్నారు . ఇక పొంగులేటి శిభిరంలో ఉన్న వారిలో వైరా విజయాబాయి , కొత్తగూడెం నుంచి పొంగులేటి , సత్తుపల్లి నుంచి సుధాకర్ లు ఉన్నారు . అయితే ఈసారి అధిష్టానం స్థానిక కాంగ్రెస్ నాయకుల ప్రతిపాదనలను పరిశీలిస్తూనే గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం . అదికూడా సర్వేల ఆధారంగా ప్రజల్లో సానుకూలంగా ఉన్న అభ్యర్థులకు, ఎవరి మనుషులు ,ఏవర్గం అనేది చూడకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో పొంగులేటి చేరిక కొత్త ఊపు నిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో కార్యకర్తల బలం ,ప్రజల్లో పలుకుబడి ఉన్న శ్రీనివాస్ రెడ్డి ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. ఆయన చేరిక సానుకూల పరిణామంగా పార్టీ భావిస్తుంది. అందువల్ల తాను భాద్యత తీసుకోని గెలిపిస్తానని హామీ ఇచ్చే సీట్లలో కూడా సర్వే ఆధారంగానే టికెట్స్ కేటాయింపు ఉంటుందని అంటున్నారు . పాలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ ను భట్టి అనుయాయుడిగా ముద్రపడిన రాయల నాగేశ్వరరావు ఆశిస్తుండగా , రేణుకా చౌదరిని నమ్ముకొని మద్ది శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు . అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరి పోటీచేయడమా ..లేక కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేయడమా అనే చర్చ జరుగుతుంది. ఇల్లందులో కోరం కనకయ్య పోటీ దాదాపు ఖాయమనే అంటున్నారు . ఖమ్మం లో పొంగులేటిని దించాలని పార్టీ భావిస్తుంది. ఆయన కొత్తగూడెం పై మొగ్గు చూపుతున్నారు .ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఉద్యోగుల సంఘం మాజీనేత ఏలూరి శ్రీనివాస్ రావు ,డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు , కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న మహ్మద్ జావేద్ ,అన్యూహ్య పరిణామాలు జరిగితే రేణుకా చౌదరి సైతం పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .అశ్వారావు పేట నుంచి జారే ఆదినారాయణ , సున్నం నాగమణి , తాటి వెంకటేశ్వర్లు , ఉన్నారు . పినపాక నుంచి పొంగులేటి అనుయాయుడు పాయం వెంకటేశ్వర్లు , ఉండగా శ్రీవాణి ,సీతక్క కుమారుడు సూర్య , విజయ్ , సంతోష్ , పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. భద్రాచలం నుంచి సీటింగ్ అభ్యర్థి పొదెం వీరయ్య ఉండగా , పొంగులేటి అనుయాయుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కూడా పరిశీలనలో ఉన్నారు . అయితే పొదెంసీటు మారితే తెల్లంకు అవకాశం ఉంటుంది…