‘నేను బచ్చానే.. దమ్ముంటే నెల్లూరులో నాపై పోటీ చేయ్’ ఆనం రామనారాయణ రెడ్డికి అనిల్ యాదవ్ సవాల్
- మొదలు పెట్టిన చోటే ఆనం రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతానని ఛాలెంజ్
- తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని వెల్లడి
- గత ఎన్నికల్లో జగన్ భిక్ష వల్లే ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఆయననే తిడుతున్నారని విమర్శ
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను బచ్చా అంటున్నారు.. అవును బచ్చానే, మరి ఈ బచ్చాగాడిపై గెలిచే దమ్ముందా అంటూ ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సవాల్ విసిరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఆనం రాజకీయ జీవితం నెల్లూరులో మొదలైందని, అదే నెల్లూరులో ఆయన రాజకీయ జీవితానికి తాను ముగింపు పలుకుతానని పేర్కొన్నారు. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.
చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచాడని అనిల్ యాదవ్ చెప్పారు. అలాంటి జగన్ నే ఇప్పుడు తిడుతున్నారని మండిపడ్డారు. తనను రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఆనం రామనారయణ రెడ్డి విసిరిన ఛాలెంజ్ పై స్పందిస్తూ.. ఇప్పుడు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని గుర్తుచేశారు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం.. పార్టీ మారేముందు కనీసం తన పదవికి రాజీనామా చేయకపోవడాన్ని విమర్శించారు. రాజకీయంగా పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన నేతలు, ఒకసారి కూడా గెలవని టీడీపీ నేత ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పప్పు, పులకేసి అని ప్రజలు పిలిచే ఆ నేత కంటే.. తన స్థాయే పెద్దదని చెప్పారు.