మేడమ్.. మీరు టమాటాలు తింటున్నారా?: ఆర్థిక మంత్రికి శివసేన ప్రశ్న
- ట్విట్టర్లో ప్రశ్న సంధించిన శివసేన నేత ప్రియాంకా చతుర్వేది
- ధరలు పెరగడంపై సమాధానం ఇవ్వగలరా అంటూ నిలదీత
- దేశవ్యాప్తంగా కిలో రూ.100 దాటిన ధర
దేశవ్యాప్తంగా ఇప్పుడు టమాటాలు వినియోగదారులకు మంట పుట్టిస్తున్నాయి. వీటి ధర కొన్ని రోజుల క్రితం ఉన్న కిలో రూ.10-20 నుంచి ఏకంగా రూ.100కు చేరింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో రూ.100 పలుకుతోంది. దీనిపై శివసేన (యూబీటీ/ఉద్దవ్ బాలా సాహెబ్ థాకరే) నేత ప్రియాంకా చతుర్వేది స్పందించారు. నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు.
‘‘దేశ ఆర్థిక మంత్రి టమాటాలు తింటున్నారా? టామాటా ధరలు పెరగడంపై సమాధానం ఇవ్వగలరా?’’అని ప్రశ్నిస్తూ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు. గతంలో ఉల్లిగడ్డల ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో ప్రస్తావన వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తు చేసినట్టయింది. 2019లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరపై మంత్రికి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఉల్లిగడ్డల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించారు. ‘‘నేను ఎక్కువగా ఉల్లిగడ్డలు, వెల్లుల్లి తినను. కనుక నాకేమీ ఆందోళన లేదు. ఉల్లిగడ్డల అవసరం లేని కుటుంబం నుంచి వచ్చాను’’ అంటూ నాడు మంత్రి వ్యాఖ్యలు చేయడంతో.. తాజాగా టమాటాల ధరలపై ప్రియాంకా చతుర్వేది మంత్రి వైఖరిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వర్షాలు సకాలంలో రాకపోవడం, వేడి వాతావరణం నేపథ్యంలో టమాటా సాగు, దిగుబడిపై ప్రభావం పడడమే ఈ పరిస్థితికి కారణం.