అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్!: కేంద్రమంత్రి పదవిపై కిషన్ రెడ్డి వ్యాఖ్య…
- పార్టీకి విధేయుడనని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనన్న కిషన్ రెడ్డి
- అధిష్ఠానం నిర్ణయం మేరకు ముందుకు సాగుతానని వెల్లడి
- కేంద్ర కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి దూరం!
తాను పార్టీకి విధేయుడనని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బుధవారం ఆయన మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ… అధిష్ఠానం నిర్ణయం మేరకు తాను ముందుకు సాగుతానని చెప్పారు. జులై 8న వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి పదవికి సంబంధించి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రిగా ఉంటూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించడం ఇబ్బందికరమే. ఈ క్రమంలో ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం సాగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.