ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండడం మాత్రం సరికాదు!: లాలూ ప్రసాద్ యాదవ్
- ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆర్జేడీ అధినేత వ్యాఖ్య
- కాబోయే ప్రధాని భార్య లేకుండా ఉండకూడదన్న లాలూ
- కొన్నిరోజుల క్రితం పెళ్లి చేసుకోవాలని రాహుల్ కు సూచన
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఈ కూటమిలో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రధాని కచ్చితంగా భార్య లేనివాడు ఉండకూడదంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈరోజు లాలూ విలేకరులతో మాట్లాడుతూ… దేశ ప్రధాని ఎవరైనా వారు కచ్చితంగా భార్యతో ఉండాలన్నారు. భార్య లేకుండా ప్రధాని నివాసం వుండడం సరికాదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నియమాన్ని తప్పవద్దని వ్యాఖ్యానించారు.
అంతకుముందు, పెళ్లి చేసుకోవాలంటూ రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ సూచించారు. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉంది. ఈ కూటమి నుండి రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు భార్య లేనివారు ప్రధానిగా ఉండకూడదన్నారు.
లాలూ ఇంకా మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలకు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 300 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏ అవినీతి నాయకుడిని వదిలేది లేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కరప్ట్ పొలిటీషియన్స్ కన్వీనర్ మోదీయే అని ఎద్దేవా చేశారు. ఇందుకు నిదర్శనం మహారాష్ట్ర రాజకీయాలే అన్నారు.