Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు…

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

  • రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న పురందేశ్వరి
  • ఏపీకి పెట్టుబడులు రాని పరిస్థితి నెలకొందని విమర్శ
  • కేంద్రం 22 లక్షల ఇళ్లను ఇస్తే 35 శాతం నిర్మాణాలను కూడా పూర్తి చేయలేదని మండిపాటు
  • కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని వ్యాఖ్య
  • సచివాలయాలను కూడా కేంద్ర నిధులతోనే నిర్మించారని ఎద్దేవా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆసీనులయ్యారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి, మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు. పురందేశ్వరి అధ్యక్ష బాధ్యతల కార్యక్రమానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. బీజేపీ కార్యాలయం అభిమానులతో కిక్కిరిసి పోయింది.

మరోవైపు బాధ్యతలను స్వీకరించిన అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వ చలవతోనే రాష్ట్రంలో రహదారులు నిర్మితమవుతున్నాయని… రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రహదారిని కూడా వేయలేదని దుయ్యబట్టారు. రోడ్ల దుస్థితిపై ప్రజలను అడిగితే చెపుతారని అన్నారు.

ఒక్క ఏపీకే కేంద్ర ప్రభుత్వం 22 లక్షల ఇళ్లను ఇచ్చిందని పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రంలో 35 శాతం ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, దీనిపై పేదలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు.

విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలను రెండేళ్లలోనే దాదాపు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని పురందేశ్వరి చెప్పారు. రాష్ట్రంలో పలు ఎయిర్ పోర్టులను కూడా కేంద్రం నిర్మించిందని అన్నారు. ఏపీలో పలు చోట్ల ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే ఇది సాధ్యపడుతుందని… కానీ, రాష్ట్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

రాష్ట్రంలో పలు కార్యక్రమాలను తామే చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని… వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అన్నారు. సచివాలయాల నిర్మాణాలను కూడా కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారని చెప్పారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మందికి ప్రతి నెల 5 కేజీల బియ్యం, ఒక కిలో పప్పును ప్రధాని మోదీ అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో 90 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని అమ్ముతున్నారని విమర్శించారు. దశల వారీగా మద్యనిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం… ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మద్యం విక్రయాల్లో పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో భూదోపిడీ, ఇసుక దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని… ఇటీవలే రూ. 12 వేల కోట్లను విడుదల చేసిందని తెలిపారు. పోలవరం కట్టడం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని అన్నారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితి ఎందుకు నెలకొందని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రూ. 12 వేలు ఇస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి కృషి చేస్తానని… పార్టీ నేతలు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. ప్రజాహితం కోసం కాకుండా, తన స్వలాభం కోసం జగన్ పని చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని… ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. వైసీపీకి అధికారంలో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో బీజేపీతో ఉన్నారని, ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నారని చెప్పారు.

Related posts

ఏపీలో మండలి రద్దుపై జగన్ పునరాలోచన -వైసీపీ బలం పెరగటమే కారణమా ?

Drukpadam

బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

Ram Narayana

ఆళ్ళ… షర్మిల వద్దకు జగన్ దూతగా వెళ్ళారా  …?

Drukpadam

Leave a Comment