మంచిర్యాల జిల్లాలో దారుణం…చెక్‌పోస్టు గేటు తగిలి యువకుడి మృతి
-దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ప్రమాదం
-చెక్‌పోస్టు గేటు కింది నుంచి వెళ్లే ప్రయత్నం
-గేటు తగిలి మరణించిన వెనక కూర్చున్న వ్యక్తి
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బైక్‌పై వెళ్తున్న యువకుడు పోలీసుల భయంతో వెనక కూర్చున్న తన మిత్రుడి ప్రాణాలను పణంగా పెట్టాడు. జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ వద్ద జరిగిందీ ఘటన.
ఇక్కడ ఏర్పాటు చేసిన అటవీశాఖ తనిఖీ కేంద్రం వైపుగా ఇద్దరు యువకులు బైక్‌పై దూసుకొస్తున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉండడం, చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఉండడంతో బైక్‌ను డ్రైవ్ చేస్తున్న యువకుడు భయపడ్డాడు. మరోవైపు, చెక్‌పోస్టు వద్ద ఉన్న పోలీసులు యువకుడిని ఆపాలంటూ చేయి చూపించారు. దీంతో మరింత భయపడిపోయిన యువకుడు వారికి పట్టుబడకూడదన్న ఉద్దేశంతో బైక్‌ను శరవేగంగా పోనిచ్చాడు.
కీడు శంకించిన పోలీసు చెక్‌పోస్టు గేటును పైకి లేపే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆలస్యం జరిగింది. బైక్‌ను వేగంగా గేటు కిందినుంచి పోనిచ్చాడు. ఈ క్రమంలో వెనక కూర్చున్న మిత్రుడి గురించి పట్టించుకోలేదు. దీంతో అతడి మెడకు గేటు బలంగా తాకడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ పట్టించుకోని బైకర్ అదే వేగంతో దూసుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన చెక్‌పోస్టు వద్దనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయింది.