- గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హర్యానా మహిళలు
- వారితో కలిసి భోజనం చేసిన సోనియా, రాహుల్, ప్రియాంక
- రాజీవ్ గాంధీ ప్రస్తావన వచ్చినప్పుడు భావోద్వేగానికి గురైన సోనియా
హర్యానాకు చెందిన మహిళా రైతులు గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసానికి వచ్చారు. వీరిది సోనీపట్ జిల్లా మదీనా గ్రామం. రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించిన సమయంలో ఢిల్లీకి రావాలని ఉందని రాహుల్ కు ఈ మహిళలు చెప్పారు. దీంతో వీరిని తన నివాసానికి ఆహ్వానించారు రాహుల్. ఈ క్రమంలో వీరు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్ పథ్ లో సోనియా నివాసానికి చేరుకున్నారు.
హర్యానా మహిళలను సోనియా కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. అనంతరం సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలిసి వారు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ సోనియాతో మాట్లాడుతూ… రాహుల్ కు పెళ్లి చేద్దామా? అని అడిగారు. దీనికి సోనియా బదులిస్తూ… ఒక మంచి అమ్మాయిని మీరే చూడండి అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
మరోవైపు రాజీవ్ గాంధీ మరణం గురించి మహిళలు ప్రస్తావించగా… సోనియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ప్రియాంక స్పందిస్తూ… నాన్న మరణంతో అమ్మ బాగా కుంగిపోయారని, కొన్ని రోజులు ఆహారం, నీళ్లు ముట్టలేదని చెప్పారు. ఈ సందర్భంగా సోనియా కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆ తర్వాత తేరుకుని మహిళలతో మాట్లాడారు. వారితో కలిసి సోనియా, ప్రియాంక డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ షేర్ చేశారు.