- టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం
- ప్రభుత్వ ఉద్యోగులుగా 43 వేలమందికి పైగా ఆర్టీసీ కార్మికులు
- మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థ భారీ విస్తరణ
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దాదాపు ఐదు గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 43 వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించనున్నారు. ఇందుకోసం అధికారులతో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాయదుర్గం-విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇస్నాపూర్ నుండి మియాపూర్ వరక మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మియాపూర్ నుండి లక్డీకాపూల్ వరకు, ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుండి బీబీ నగర్ వరకు, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని, జేబీఎస్ నుండి తూంకుంట వరకు, ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు.
ఇటీవల పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయని, పది జిల్లాల్లో రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు అద్భుతంగా పని చేశారని, వారికి ఆగస్ట్ 15న ప్రభుత్వం తరఫున సత్కారం చేస్తామన్నారు. ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్ నూ సన్మానిస్తామన్నారు.
ఖమ్మం మున్నేరుకు 150 కోట్లతో రిటైనింగ్ వాల్ …ఫలించిన మంత్రి కృషి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం ను అనుకోని పోతున్న మున్నేరు వరదలకు ఖమ్మం నగరం లోని అనేక కాలనీలు నీట మునిగాయి. కాలనీలోకి నీరు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని స్థానిక శాసనసభ్యులు మంత్రి పువ్వాడ అజయ్ చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు . ఖమ్మం నగరంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇళ్లలోకి వరద రాకుండా శాశ్విత పరిస్కారం దిశగా రిటైనింగ్ వాల్ కోసం సోమవారం హైద్రాబాద్ లో జరిగిన మంత్రి మండలి ఆమోదం తెలిపింది .అందుకు అవసరమైన 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మీడియా సమావేశంలో కేటీఆర్ వెల్లడించారు …