సిబిఐ కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్…
-ప్రధాని నేతృత్వంలో హైపవర్ కమిటీ నిర్ణయం
-అనేక పేర్లు పరిశీలనా చివరకు జైస్వాల్ వైపే మొగ్గు
-జైస్వాల్ మహారాష్ట్ర క్యాడర్ ఐ పి ఎస్ అధికారి
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్ కుమార్ జైస్వాల్ మంగళవారం నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి పాల్గొన్నారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ మహారాష్ట్ర కేడర్ 1985 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ చీఫ్‌గా పనిచేస్తున్నారు. జైస్వాల్ ఇంతకుముందు ముంబై పోలీసు కమిషనర్, మహారాష్ట్ర డీజీపీ పదవులను నిర్వహించారు. ఆయన కేంద్ర పదవులను కూడా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా)లలో సుదీర్ఘకాలం పనిచేశారు.
ప్రధానమంత్రి మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, లోక్‌భలో ప్రతిపక్ష నాయకుడు అధికర్ రంజన్ చౌదరిలతో కూడిన హైపవర్ కమిటీ సమావేశం మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. దాదాపు 90 నిమిషాల సమావేశంలో.. సీబీఐ డైరెక్టర్ పదవికి అధికారులను ఎన్నుకునే ప్రక్రియపై చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.రిషి కుమార్ శుక్లా రెండేళ్ల వ్యవధి తరువాత ఫిబ్రవరి 4న పదవీ విరమణ చేసినందున నాటి నుంచి సీబీఐ డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. అధికారిక నియామకం జరిగే వరకు ఈ పదవిని 1988 బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హాకు అప్పగించారు. తాజాగా, సుబోధ్ కుమార్ జైస్వాల్ సీబీఐ అధిపతిగా నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు .