Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

అంగళ్ల ఘటనపై వైసీపీ ,టీడీపీ పరస్పర ఆరోపణలు ..

అంగళ్లు ఘటన విచారణ సీబీఐకి అప్పగించండి… కారకులు ఎవరో తెలిసిపోతుంది: గంటా

  • ఇటీవల అంగళ్లులో హింసాత్మక ఘటనలు
  • చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వైనం
  • చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు పెట్టడం చేతగానితనం అన్న గంటా

ఇటీవల అన్నమయ్య జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగళ్లులో ఎన్ఎస్ జీ కమాండోలు, మీడియా, ప్రజలు చూస్తుండగానే చంద్రబాబుపై హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. 

చంద్రబాబుపై జరిగిన ఘటన విచారణను సీబీఐకి అప్పగిస్తే, దాడికి కారకులు ఎవరో తెలిసిపోతుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, చంద్రబాబుపైనా, టీడీపీ నేతలపైనా కేసులు పెట్టడంపై గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై చేయాల్సిన దౌర్జన్యాలు, పెట్టాల్సిన కేసులు సరిపోక ఇప్పుడు చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం అని ఘాటుగా విమర్శించారు. 

“అంగళ్లు ఘటనలో వైసీపీ గూండాల అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా మా నాయకుడి మీద కేసు పెట్టడం మీ అరాచక పాలనకు పరాకాష్ఠ” అని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవస్థను నిస్సహాయులుగా చేయడమే కాకుండా, వారిని కూడా అధికార పార్టీ నేరాల్లో భాగస్వాములను చేస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారని గంటా పేర్కొన్నారు.

“సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు చేపట్టిన యుద్ధభేరి, లోకేశ్ చేపట్టిన యువగళంకు లక్షలాది మంది జనం వస్తుండడంతో జగన్ వెన్నులో వణుకు మొదలై, అసహనంతో తప్పుడు కేసులతో భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడి ఉంటే రాష్ట్రంలో మీ పాదయాత్రలు, ప్రచారాలు సాఫీగా చేయగలిగేవారా…? అరాచకాలు, విధ్వంసాలతో ప్రారంభమైన మీ ప్రభుత్వ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుర్తుంచుకోండి జగన్ గారూ” అంటూ గంటా తీవ్రస్థాయిలో స్పందించారు.

రాష్ట్రం తగలబడాలని చంద్రబాబు పుంగనూరు నుంచే ప్లాన్ చేశారు: సజ్జల

  • ఇటీవల రాయలసీమలో చంద్రబాబు పర్యటన
  • అంగళ్లు, పుంగనూరులో హింసాత్మక ఘటనలు
  • తనపై హత్యాయత్నం చేశారన్న చంద్రబాబు
  • చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు చిన్నప్పటి నుంచి అలవాటేనన్న సజ్జల

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో హింసాత్మక ఘటనలు, తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. అంగళ్లులో తనపై జరిగింది హత్యాయత్నమేనని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇటీవల జరిగిన ఘటనల వీడియో క్లిప్పింగ్స్ ను మీడియాకు ప్రదర్శించారు. అల్లర్లు సృష్టించిందీ, అరాచకాలకు పాల్పడిందీ చంద్రబాబు, ఆయన ముఠానే అని ఆరోపించారు. రాష్ట్రం తగలబడాలని చంద్రబాబు పుంగనూరు నుంచే ప్లాన్ చేశారని తెలిపారు. 

పుంగనూరు సహా అనేక ప్రాంతాల్లో అల్లర్లకు ప్రణాళిక రూపొందించారని వివరించారు. ఇటీవల జరిగిన ఘటన సమయంలో చంద్రబాబులో వికృత ఆనందం కనిపించిందని సజ్జల విమర్శించారు.

“నాయకుడు అంటే ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ, చంద్రబాబు రెచ్చగొట్టాడు. కుట్ర కోణం లేకుండా ఇలాంటి ఘటనలు జరుగుతాయా? టీడీపీ శ్రేణులను ఎవరూ రెచ్చగొట్టింది లేదు. వాళ్లకై వాళ్లే ఉన్మాదంతో రెచ్చిపోయారు. దశాబ్దానికి పైగా సీఎంగా ఉన్న ఓ ఉన్మాది శిక్షణలో తయారైన ఉన్మాదులు వీళ్లంతా. చంద్రబాబు హయాంలో ఉన్న పోలీసులే ఇప్పుడూ ఉన్నారు. పోలీసులంటే చంద్రబాబుకు చులకన భావం ఉంది. 

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఇలాంటి అల్లర్లు చంద్రబాబుకు కొత్త కాదు. విద్యార్థి దశ నుంచే ఉన్నాయి… ఆ విషయం మాకు తెలుసు. గొడవలు జరగాలి… శాంతిభద్రతల సమస్య తలెత్తాలి… దాన్నుంచి ఏదైనా లబ్ది పొందాలి… చిన్నప్పటి నుంచి చంద్రబాబు పంథా ఇదే. ఎన్ని ప్రాణాలు పోయినా సరే తన ప్రయోజనాలే తనకు ముఖ్యం. 

ఏదో ధర్నా జరగాల్సి ఉంటే… ఉత్త ధర్నాతో ఏం జరుగుతుంది, కనీసం నాలుగైదు బస్సులైనా తగలబడితే కదా ఏదైనా ప్రభావం ఉండేదని చంద్రబాబు అన్నట్టు తోడల్లుడు దగ్గుబాటి అప్పట్లో తెలిపారు. 

చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్నారా… లేక రెచ్చగొట్టేందుకు వెళ్లారా? ఇటీవలి ఘటనల్లో పోలీసుల కాల్పుల వరకు వెళ్లాలి… శాంతిభద్రతలు భగ్నమైతే రాష్ట్రమంతా అల్లర్లు జరగాలి అనే దిక్కుమాలిన కుట్రకు పాల్పడ్డారు.పోలీసులు సంయమనం పాటించడంతో టీడీపీ ప్రణాళిక నెరవేరలేదు. ఎస్పీ చాలా శాంతంగా వ్యవహరించాడు. పోలీసులే వెనక్కి తగ్గిన విషయం వీడియోలో స్పష్టంగా కనబడుతుంది.

ప్రజాక్షేత్రంలో  ఏంచేయలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమైంది… అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. జగన్ తో పోల్చుకునేందుకు ఏమీ లేదు…. నేనీ అభివృద్ధి చేశాను… నాకు ఓటేయండి అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. జగన్ పాలనలో లోపాలు ఎత్తిచూపడానికి ఏమీ దొరకడంలేదు. 

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక పవన్ కల్యాణ్ ను పక్కనబెట్టుకుని ఊపు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ లోపు ఇలాంటి ఘటనలతో లబ్ది పొందాలని చూస్తున్నారు. ఇంకో పక్క ఆయన కొడుకు… ఆయన రూట్లో ఆయన తిరుగుతున్నారు. వీళ్లలో ఒక్కరైనా రెచ్చగొట్టే రకంగా కాకుండా, బూతులు మాట్లాడకుండా ఉండలేరు. 

చంద్రబాబు వంటి గుంటనక్కలు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం సహించదు అనే గట్టి సందేశాన్ని పంపిస్తాం. ఈ ఘటనలకు సీబీఐ, ఎఫ్ బీఐ విచారణలు అక్కర్లేదు. వాళ్లు అడ్డంగా దొరికిపోయారు… అన్ని ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు ప్లాన్ మేరకు కుట్రకు పాల్పడినవాళ్లు దొరికారు. చంద్రబాబు సహా క్షేత్రస్థాయి నాయకులందరూ పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే” అని సజ్జల స్పష్టం చేశారు.

Related posts

జ్వరం వచ్చిన వెంటనే పిల్లలకు పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేసేస్తున్నారా?.. ఇకపై అలా చేయొద్దు!

Drukpadam

మోదీ కేబినెట్లో 20 మంది సీనియర్లకు ఉద్వాసన.. ఎందుకంటే!?

Drukpadam

కేంద్ర మంత్రుల‌తో రాజ‌ధాని రైతుల భేటీ.. ఏమేం కోరారంటే..?

Drukpadam

Leave a Comment