Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
పార్లమంట్ న్యూస్ ...

ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: అవిశ్వాస తీర్మానం సందర్భంగా అమిత్ షా

  • అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదన్న అమిత్ షా   
  • మోదీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారన్న కేంద్రమంత్రి
  • అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలమెంతో తెలుస్తుందని వ్యాఖ్య
  • నాడు మహాత్ముడు.. నేడు మోదీ క్విట్ I.N.D.I.A.కు పిలుపునిచ్చారని కామెంట్ 
  • అవిశ్వాసంలో పీవీ సర్కార్ డబ్బులిచ్చి గెలిచిందనే ఆరోపణలున్నాయన్న షా
  • తాము నిజాయతీగా వ్యవహరించడంతో ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోయిందని వెల్లడి 

అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని, మోదీ పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ… తమ ప్రభుత్వం మైనార్టీలో లేదన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చారిత్రాత్మకమైనవన్నారు. ఆగస్ట్ 9న నాడు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అని పిలుపునిచ్చారని, ఇప్పుడు ప్రధాని మోదీ క్విట్ I.N.D.I.A. అని పిలుపునిచ్చారన్నారు. ప్రజలకు మోదీ ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు, సభకు అవిశ్వాసం లేదన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయన్నారు.

అవిశ్వాస తీర్మానం ఒక రాజ్యాంగ ప్రక్రియ అని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజలకు అంతా తెలుసునని, వారు అన్నీ చూస్తున్నారన్నారు. అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలం ఎంతో తెలుస్తుందన్నారు. పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు వారు గెలిచారని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులు జైలుకెళ్లారని గుర్తు చేశారు. డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారని ఆరోపణలు వచ్చాయన్నారు. వాజపేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు మేం నిజాయతీగా వ్యవహరించామని, అందుకే ఒక్క ఓటుతో తమ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. తాము కాంగ్రెస్‌లో గిమ్మిక్కులు చేయలేదన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందన్నారు.

తాము తాయిలాలు పంచడం లేదన్నారు. రుణమాఫీలపై తమకు నమ్మకం లేదన్నారు. ఎవరూ లోన్ తీసుకోకూడదన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ రూ.70 వేలకోట్ల రుణమాఫీ తాయిలాలు ఇచ్చిందన్నారు. డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ చాలా చెప్పింది కానీ, ఏమీ చేయలేదని, మేం మాత్రం చేసి చూపించామన్నారు. జన్ ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని, కరోనా వ్యాక్సీన్ వచ్చినప్పుడు కూడా మోదీ వ్యాక్సీన్ అని విమర్శలు చేశారని గుర్తు చేశారు. రైతుకు కావాల్సింది రుణమాఫీ కాదని, వారికి రుణభారం కావొద్దన్నారు. తాము ఉచితాలకు వ్యతిరేకమని, స్వయంసమృద్ధిపై దృష్టి సారించామన్నారు.

ఒక ఎంపీ పదమూడుసార్లు రీలాంచ్ అయ్యాడని, పదమూడుసార్లు ఫెయిలయ్యాడంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మేడిన్ ఇండియా ఆలోచనను రాహుల్, అఖిలేష్ తప్పుబట్టారన్నారు. రానున్న అయిదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తిరుగులేని శక్తిగా మారుతుందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అన్నారు. ప్రధాని మోదీ 14 దేశాల నుండి అత్యున్నత పురస్కారం పొందారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదుల అంతు చూశామన్నారు. పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్టైక్ చేశామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 4 వేల మంది తీవ్రవాదులను మట్టుబెట్టామన్నారు. ఏడు కీలక రంగాల్లో ప్రధాని మోదీ బలమైన పునాది వేశారన్నారు. ఎంఎన్‌పీ విషయంలో విపక్షాలు రాజకీయం చేశాయన్నారు. పీఎఫ్ఐ‌ని తాము నిషేధించినట్లు చెప్పారు. నిషేధానికి ముందు 90 ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు చెప్పారు.

Related posts

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన రేణుకా చౌదరి

Ram Narayana

మన రాజ్యాంగం అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం …లోకసభలో ప్రధాని మోడీ ..

Ram Narayana

రాజ్యసభలో నోట్లు కలకలం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద లభ్యం!

Ram Narayana

Leave a Comment