- రాహుల్ చర్యలో ఆత్మీయతే కనిపిస్తోందన్న ప్రియాంక
- ద్వేషాన్ని కక్కడానికి అలవాటు పడిన మీకు ప్రేమ కనిపించదని మండిపాటు
- ఎంపీ పదవిపై మీరు వేటు వేసినా మీపై ప్రేమనే కురిపించారని వ్యాఖ్య
మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికారపక్ష సభ్యులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాహల్ కిస్ ఇచ్చారంటూ ఎన్డీయే సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ అంశంపై ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన (యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్ లో తప్పేమీ లేదని, ఆయన చర్యలో ఆత్మీయత కనిపిస్తోందని చెప్పారు.
సభలో రాహుల్ మాట్లాడుతున్నప్పుడు కేంద్ర మంత్రులంతా నిలబడి ఉన్నారని, రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రియాంక విమర్శించారు. అయినప్పటికీ రాహుల్ ఆగ్రహానికి గురి కాకుండా… అత్మీయతను పంచేలా వ్యవహరించారని చెప్పారు. రాహల్ చర్య వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఇతరులపై అంతులేని ద్వేషాన్ని కక్కడానికి మీరు అలవాటు పడిపోయారని… ప్రేమ, ఆత్మీయతను పంచడాన్ని మీరు అర్థం చేసుకోలేరని అధికారపక్ష నేతలను దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేశారని, అధికారిక బంగ్లా నుంచి వెళ్లగొట్టారని… అయినా కోర్టులో కేసు గెలిచి ఆయన పార్లమెంటులో మళ్లీ అడుగు పెట్టారని ప్రియాంక అన్నారు. ఇంత చేసినా మీమీద రాహుల్ ద్వేషాన్ని ప్రదర్శించలేదని, ప్రేమనే వ్యక్తం చేశారని చెప్పారు. మీకు ఏదైనా సమస్య ఉంటే అది మీ సమస్యే తప్ప ఇతరుల సమస్య కాదని అన్నారు.