- అభివృద్ధి పేరుతో కేసీఆర్ దోపిడీకి తెరలేపారన్న ఈటల
- పేదల నుంచి భూములు లాక్కునేందుకే మాస్టర్ ప్లాన్ అని ఆరోపణ
- అగ్రిజోన్ ను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చే అధికారం ఎవరిచ్చారంటూ ఆగ్రహం
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల లబ్ది కోసమే నిర్మల్ కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ దోపిడీకి తెరలేపారని విమర్శించారు. పేదల నుంచి భూములు లాక్కోవడానికే నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేశారని ఆరోపించారు. అగ్రిజోన్ ను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చే అధికారం ఎవరిచ్చారంటూ ఈటల ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. నిర్మల్ కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీవో 220 వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో బీజేపీ నేత, మాజీ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఈటల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పై వ్యాఖ్యలు చేశారు.
తామేమీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ, రైతుల కళ్లలో మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తుండడం బాధాకరమని ఈటల పేర్కొన్నారు. రింగ్ రోడ్డు ఎటు వస్తుందో తెలుసుకుని, రైతుల నుంచి ముందే తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు బాగుపడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ వచ్చాక కొత్త రూపం ఎత్తారని, భూములు అమ్ముకుంటూ బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారని ఈటల పేర్కొన్నారు.