-కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం సర్వే చేయిస్తాం: రేవంత్ రెడ్డి
-ఆశావహుల నుండి 25 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్న టీపీసీసీ చీఫ్
-దరఖాస్తుదారుల బలాలు, బలహీనతలపై సర్వేలు చేయించి అభ్యర్థిని నిర్ణయిస్తామని వెల్లడి
-దరఖాస్తు రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహుల నుండి ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులైన వారి కోసం సర్వేలు చేయించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుదారుల బలాలు, బలహీనతలపై సర్వే చేయిస్తామన్నారు.
సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలు అంచనాలు వేస్తామన్నారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తుందని, ఆ తర్వాత అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. అక్కడ కూడా అభ్యర్థి విషయంలో ఇబ్బందులు ఏర్పడితే సీడబ్ల్యుసీకి పంపిస్తామన్నారు.
ఆశావహులు ఎస్సీ, ఎస్టీలు అయితే దరఖాస్తుకు రూ.25 వేలు, బీసీ, ఓసీలు అయితే రూ.50 వేలు దరఖాస్తు రుసుముగా నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తు రుసుమును పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు. ఈ నెల 25 తర్వాత స్క్రూటినీ ఉంటుందన్నారు.