డబ్బుల కోసమే కాంగ్రెస్ దరఖాస్తులు తీసుకుంటోంది: బండి సంజయ్
సర్కార్ ఖజానా దివాలా తీయడం వల్లే ముందస్తు మద్యం టెండర్లు అన్న ఎంపీ
తాను ఎక్కడి నుండి పోటీ చేయాలో పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టీకరణ
పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగారుస్తున్నారని ఆరోపణ
డబ్బుల కోసమే కాంగ్రెస్ ఆశావహులనుండి దరఖాస్తులు తీసుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ… సర్కార్ ఖజానా దివాలా తీసిందని, అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు టెండర్లకు పిలిచిందన్నారు. ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలను బీజేపీ అడ్డుకోదన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనే అంశంపై ఇప్పటి వరకు పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చారని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల్లో బాధితులను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. బాలిక మృతిని ఆత్మహత్యగా తేల్చేశారని, ఇది దిశ కంటే దారుణమైన సంఘటన అన్నారు. బీఆర్ఎస్ మంత్రే కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాలిక కేసులో సీఎంవో నుండి పోలీసులపై ఒత్తిడి ఉందన్నారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.