- చివరి డీబూస్టింగ్ ప్రక్రియను ఆదివారం విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో
- జాబిల్లికి అత్యంత సమీపంలోని కక్ష్యలోకి చేరిక
- ప్రయోగంలో చిట్టచివరి ఘట్టమైన సాఫ్ట్ ల్యాండింగ్‌పై ఇస్రో దృష్టి
- ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రారంభమవుతుందని వెల్లడి
చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడి చుట్టూ అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలోకి పెట్టారు. ఈ ప్రయోగంలో చివరి డిబూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రస్తుతం విక్రమ్ మాడ్యూల్ చంద్రుడికి అతిదగ్గరగా ఉన్న 25 బై 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగంలో ఇక మిగిలింది జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియపై దృష్టి సారించారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
‘‘రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీ బై 134 కీ.మీల కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.