Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

హరీష్ రావు పై మైనంపల్లి విమర్శలు …కేసీఆర్ ,కేటీఆర్ ఆగ్రహం….

హరీశ్‌రావుపై మైనంపల్లి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించిన సీఎం కేసీఆర్
మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్న బీఆర్ఎస్ అధినేత
ఆదేశాలు పాటించకపోతే ఆయనిష్టమని వ్యాఖ్య
పోటీ చేస్తారా? లేదా? ఆయనకే వదిలేశామని స్పష్టీకరణ

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. మైనంపల్లి పార్టీ ఆదేశాలు పాటిస్తే మంచిదన్నారు. పాటించకపోతే ఇక ఆయనిష్టమన్నారు. పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా? అనేది ఆయనకే వదిలేశామని చెప్పారు. మైనంపల్లి తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన సందర్భంగా మీడియా ప్రతినిధులు మైనంపల్లి గురించి అడగగా.. కేసీఆర్ కూడా చురకలు అంటించారు.

పార్టీలో అసంతృప్త గళంపై అసహనం వ్యక్తం చేసిన వైనం కేటీఆర్ …

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేడు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడం తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, మరోసారి తనను సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.

టికెట్ దక్కని అభ్యర్థుల పరిస్థితిపైనా కేటీఆర్ స్పందించారు. “ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతుంటాయి. దురదృష్టవశాత్తు క్రిషాంక్ వంటి అర్హులైన, సమర్థులైన నేతలకు జాబితాలో చోటు కల్పించలేదు. క్రిషాంక్ కు, టికెట్ దక్కని ఇతర నేతలకు ప్రజా సేవ చేసేందుకు మరో రూపంలో అవకాశం దక్కేలా చూస్తాను” అని హామీ ఇచ్చారు.

ఇక, పార్టీలో అసంతృప్తి గళాలపై కేటీఆర్ అసహనం వెలిబుచ్చారు. “మా ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవడంతో నోరు పారేసుకున్నారు… మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
అంతేకాదు, మనందరం హరీశ్ రావుకు బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. హరీశ్ రావు… బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంతర్భాగంగా కొనసాగుతున్న వ్యవస్థాపక సభ్యుడు. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారు” అంటూ తన బావకు మద్దతు పలికారు.

Related posts

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి,

Ram Narayana

టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోని వీహెచ్, రేణుకాచౌదరి

Ram Narayana

తెలంగాణాలో కాంగ్రెస్ 80 సీట్లతో అధికారంలోకి వస్తుంది…రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment