Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

చంద్రుడి దక్షిణ ధ్రువం ఎందుకంత స్పెషల్..?

  • అక్కడ ల్యాండయ్యేందుకు ప్రపంచ దేశాల ఆసక్తి
  • భారత్, రష్యా సహా పలు దేశాల విఫల ప్రయోగం
  • ఎత్తైన పర్వతాలు.. భారీ లోయల వల్లేనని శాస్త్రవేత్తల వివరణ
  • చంద్రుడిపై గడ్డకట్టిన స్థితిలో నీరు ఉందని గుర్తించిన నాసా

చంద్రుడి పైకి మానవ సహిత యాత్రలు కూడా చేసిన అగ్రరాజ్యం అమెరికాకు సాధ్యం కాలేదు.. అమెరికాతో పోటీపడిన సోవియట్ యూనియన్ తోనూ కాలేదు. జాబిల్లిపైకి స్పేస్ క్రాఫ్ట్ ను పంపించిన మూడో దేశంగా రికార్డులకెక్కిన చైనాకు కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ సాధ్యం కాలేదు. అంతరిక్ష పరిశోధనలలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న భారత దేశం కూడా తొలి ప్రయత్నంలో విఫలమైంది. ఈ రోజు మరోమారు చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగిడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే రష్యా ప్రయత్నం కూడా విఫలమైంది. ఇంతకీ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఏముంది..? అక్కడ ల్యాండయ్యేందుకు ప్రపంచ దేశాలు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి..? ఇప్పుడు తెలుసుకుందాం..

భూమి ఉపగ్రహం చంద్రుడిపైకి 1960లలోనే అమెరికా, సోవియట్ యూనియన్ పోటాపోటీగా యాత్రలు నిర్వహించాయి. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించి అమెరికా చరిత్ర సృష్టించింది. అయితే, చందమామకు ఇవతలి వైపునే ఈ ప్రయోగాలన్నీ జరిగాయి. జాబిల్లి వెనుక భాగంలో ఏముందనే విషయంపై చాలా రోజుల వరకు ప్రపంచానికి క్లారిటీ రాలేదు. అపోలో మిషన్స్ లో భాగంగా చేపట్టిన యాత్రలలో చంద్రుడి వెనుక భాగంలో నీటి ఆనవాళ్లను అమెరికా సైంటిస్టులు గుర్తించారు. గడ్డకట్టిన స్థితిలో నీరు ఉందని ప్రపంచానికి వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనలలో ఈ ఆవిష్కరణ సరికొత్త ఊహలు తొడిగింది.

చంద్రుడిపై భవిష్యత్తులో మానవులు నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందని సైంటిస్టులకు నమ్మకం ఏర్పడింది. జాబిల్లిపై నీళ్లుంటే ఆక్సిజన్ తయారీతో పాటు స్పేస్ క్రాఫ్ట్ లకు ఇంధనం కూడా తయారు చేసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. అయితే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం అంత తేలిక కాదని అమెరికా సైంటిస్టులకు ఆనాడే తెలిసొచ్చింది. అక్కడి ప్రాంతమంతా ఎత్తుపల్లాలతో ఉందని వారు గుర్తించారు. ఎత్తైన పర్వతాలు, భారీ లోయలతో నిండి ఉండడం వల్ల కొంచెం అటూఇటూ అయినా ల్యాండింగ్ సమయంలో ప్రమాదం తప్పదని చెప్పారు. అందుకే మానవ సహిత యాత్రల ల్యాండింగ్ కు దక్షిణ ధ్రువాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయలేదు.

చంద్రయాన్-2 మిషన్ తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాలన్న ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నం చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లిన తర్వాత కంట్రోల్ తప్పి ల్యాండర్ కుప్పకూలింది. అప్పటి అనుభవంతో ఇస్రో తాజాగా మరోమారు ప్రయత్నం చేస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను దిద్దుకుని, ల్యాండింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుని చంద్రయాన్-3 ప్రాజెక్టు చేపట్టింది. ఇదే సమయంలో రష్యా పంపిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ ఈ నెల 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఫెయిలైంది. లూనా 25 ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది.

విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగితే.. ల్యాండర్ లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ పలు ప్రయోగాలు చేపట్టనుంది. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోగం.. అక్కడ నీటి ఆనవాళ్లను గుర్తించడమే. అక్కడ తగినన్ని నీటి నిల్వలు (వాటర్ ఐస్) ఉన్నట్లయితే చంద్రుడిపైకి భవిష్యత్తులో పంపించే మానవ సహిత యాత్రలు మరింత సులభంగా మారనున్నాయి. వాటర్ ఐస్ ను నీటి రూపంలోకి మార్చుకుని తాగునీటి అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా స్పేస్ క్రాఫ్ట్ లలోని పలు పరికరాలను చల్లబరిచేందుకు, వాటికి అవసరమయ్యే ఇంధనాన్ని తయారు చేసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. దీంతో అంతరిక్ష యాత్రల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలు ఏర్పరుచుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు.

Related posts

ఆస్ట్రేలియా అనూహ్య నిర్ణయం.. భారతీయ విద్యార్థులపై ప్రభావం…

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్!

Ram Narayana

భారీగా పెరిగిన బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు…

Ram Narayana

Leave a Comment