- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
- అఫిడవిట్ లో తప్పుడు వివరాలను సమర్పించారని నిర్ధారణ
- రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారనే కారణంగా డిస్ క్వాలిఫై చేసింది. ఎన్నికల ఫలితాలలో రెండో స్థానంలో ఉన్న బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డికి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో డీకే అరుణకు రూ. 50 వేలు చెల్లించాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు తీర్పును కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్తానన్న బీఆర్ఎస్ నేత కృష్ణమోహన్ రెడ్డి
- తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కృష్ణమోహన్ రెడ్డి స్పందన
- తనపై తప్పుడు కేసు పెట్టారన్న బీఆర్ఎస్ నేత
- 2014లో చూపించిన ప్రాపర్టీని విక్రయించినట్లు తెలిపిన కృష్ణమోహన్
- అమ్మేసిన ప్రాపర్టీని ఎలా చూపిస్తానని ప్రశ్నించిన నేత
తన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసులో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేయడంతో పాటు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ…. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానన్నారు. తాను 2014లో చూపించిన ప్రాపర్టీని 2018లో అమ్మివేశానని, ఆ కారణంగా ఆ తర్వాత ఎన్నికల అఫిడవిట్లో దానిని పేర్కొనలేదన్నారు. విక్రయించిన ప్రాపర్టీని అఫిడవిట్‌లో ఎలా చూపిస్తానన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పారు.