Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

బయట తిట్టుకోవడం …లోపల మంతనాలు …బీజేపీ ,బీఆర్ యస్ వైఖరిపై ఖర్గే ధ్వజం .

బీజేపీని… ఆ పార్టీకి మద్దతిస్తున్న కేసీఆర్‌ను గద్దెదించాలి: మల్లికార్జున ఖర్గే

  • తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారన్న ఖర్గే
  • సోనియా గాంధీతో ఫోటో దిగి ఆ తర్వాత మనసు మార్చుకున్నారని విమర్శ 
  • క్రెడిట్ ఒక్కరే తీసుకున్నారని విమర్శలు గుప్పించిన ఏఐసీసీ చీఫ్
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తామని హామీ
  • ప్రజాస్వామ్య దేశం వల్లే తాను అధ్యక్షుడినయ్యానన్న ఖర్గే
  • బీజేపీ, బీఆర్ఎస్ బయట తిట్టుకుంటాయ్.. లోపల మంతనాలు జరుపుతాయని ఆరోపణ 

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం చేవెళ్ల కేవీఆర్ మైదానంలో కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీని, తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్‌ను గద్దెదించాలని  పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, లోక్ సభ ఎన్నికల్లో మోదీని ఓడించాలన్నారు.

తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేశారని, కానీ క్రెడిట్ అంతా ఒక్కరే తీసుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ప్రజల మనసు తెలిసి సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. ప్రజభీష్టం మేరకే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీతో ఫోటో దిగిన కేసీఆర్, ఆ తర్వాత మనసు మార్చుకొని క్రెడిట్ కొట్టేశారన్నారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో చేసిందేమీ లేదని, అందుకే కేసీఆర్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని తాము నిలబెట్టుకుంటామన్నారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చి, నెరవేరుస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4 వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర చేశారని, ఇటీవల లడఖ్‌లో బైక్ రైడ్ చేశారని గుర్తు చేశారు. తాను 12 ఎన్నికలలో పోటీ చేసి, 11 సార్లు గెలిచానన్నారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయ్యానని చెప్పారు. దేశ ఐక్యతకు కృషి చేస్తూ ఇందిర, రాజీవ్‌లు ప్రాణాలు వదిలారన్నారు. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి చిన్నచిన్న రాజ్యాలను కలిపారన్నారు.

కేంద్రంలో ప్రధాని మోదీ సర్కార్‌ను ఓడించేందుకు 26 పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. బీజేపీని ఓడించేందుకు సెక్యులర్ పార్టీలు ఏకమయ్యాయని, పాట్నా, బెంగళూరులలో I.N.D.I.A. కూటమి సమావేశాలు జరిగాయని, త్వరలో ముంబైలో జరుగుతున్నాయన్నారు. బీజేపీతో పాటు తెలంగాణలో కేంద్రానికి అండగా ఉన్న కేసీఆర్‌ను కూడా తెలంగాణలో ఓడించాల్సి ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. అందుకే నేరుగా బీఆర్ఎస్ పైన బీజేపీ గట్టిగా విమర్శలు చేయడం లేదన్నారు. ఈ పార్టీలు బయట తిట్టుకుంటాయని, లోపల మంతనాలు జరుపుకుంటాయన్నారు.

బీజేపీ సహా విపక్షాలు కాంగ్రెస్ ఈ డెబ్బై ఏళ్లలో అధికారంలో ఉండి ఏం చేసిందని ప్రశ్నిస్తాయని, కానీ ఐఐటీ, ఎయిమ్స్, ఇస్రో, వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో చేసిందన్నారు. ఆహార భద్రత కోసం కాంగ్రెస్ పాటుపడిందని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ కాకుంటే ఎవరు నిర్మించారని ప్రశ్నించారు. మొబైల్, కంప్యూటర్ రావడంలో రాజీవ్ గాంధీది కీలకపాత్ర అన్నారు. భూసంస్కరణలు చేపట్టామన్నారు. వైద్య, విద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు.

 బ్యాంకులను జాతీయీకరణ చేసింది కాంగ్రెస్సే అన్నారు. హరితవిప్లవం, శ్వేతవిప్లవం కాంగ్రెస్ సమయంలోనే వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకం తెచ్చిందే తాము అన్నారు. ఇదంతా కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ, అమిత్ షా అడుగుతారని వ్యాఖ్యానించారు. మోదీ పదే పదే 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తారని, కానీ అందులో ఆరేళ్లు వాజపేయి, ఇతర ప్రధానులు కూడా ఉన్నారన్నారు. తాము తెచ్చిన సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందన్నారు. కాగా, సభా వేదికపై కాంగ్రెస్ పార్టీ గద్దర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది.

Related posts

ప్రధాని మోడీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సవాళ్లు ,ప్రతిసవాళ్లు!

Ram Narayana

ముందు మీ అవినీతి చూసుకోండని కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం చౌవాన్ ఫైర్ …

Ram Narayana

విమానం లేటైతే ప్రయాణికులు అందులోనే కూర్చోవాల్సిన పనిలేదు.. బీసీఏఎస్ కొత్త మార్గదర్శకాలు

Ram Narayana

Leave a Comment