Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

కార్డియాక్ అరెస్ట్ ముప్పును ముందే చెప్పే సంకేతాలివే.. అమెరికా తాజా అధ్యయనం

  • స్త్రీ, పురుషులలో వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయంటున్న అధ్యయనకారులు  
  • గుండె కొట్టుకోవడం ఆగడానికి 24 గంటల ముందు నుంచి హెచ్చరికలు
  • కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్.. ఒకటి కాదంటున్న వైద్యులు

హార్ట్ బీట్ లో అసాధారణ మార్పులు కనిపించి ఉన్నట్టుండి గుండె ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్.. ఇలా సడెన్ గా గుండె ఆగిపోవడంతో మెదడుతో పాటు ఇతరత్రా ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణం పోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఉన్నపుడు కార్డియాక్ అరెస్ట్ కు గురైతే వెంటనే చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇంట్లోనో, ఆఫీసులోనో మరో చోటనో ఉంటే సకాలంలో వైద్యం అందడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలామంది మృత్యువాత పడుతున్నారని నిపుణులు చెప్పారు.

సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు గురైన వారిలో 90 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ఎలాంటి గుండె జబ్బుల చరిత్ర లేకున్నా కార్డియాక్ అరెస్టుకు గురయ్యే ముప్పు ఉందని, దీంతో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోందని చెప్పారు. కార్డియాక్ అరెస్టు ముప్పును ముందే గుర్తించగలిగితే ఈ మరణాలను తగ్గించవచ్చనే ఉద్దేశంతో అమెరికాలోని కెడార్స్ సినాయ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు స్టడీ చేపట్టారు.

మొత్తంగా 1672 మంది కార్డియాక్ అరెస్ట్ బాధితులకు సంబంధించిన రిపోర్టులను, మెడికల్ హిస్టరీని విశ్లేషించినట్లు అధ్యయనకారులు తెలిపారు. కార్డియాక్ అరెస్టుకు గురయ్యే ముందు స్త్రీ పురుషుల్లో వేర్వేరు సంకేతాలు కనిపించాయని గుర్తించామన్నారు. మహిళల్లో ప్రధానంగా ఊపిరి పీల్చడం కష్టంగా మారడం, పురుషుల్లో ఛాతి నొప్పి లక్షణాలు కనిపించాయని వివరించారు. మిగతా వారిలో తలతిరగడం, మూర్ఛ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు పేర్కొన్నారు. గుండె సడెన్ గా కొట్టుకోవడం ఆగిపోవడానికి 24 గంటల ముందునుంచే ఈ లక్షణాలు కనిపించాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సుమీత్ ఛగ్ పేర్కొన్నారు.

కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్.. రెండూ వేర్వేరని వైద్యులు తెలిపారు. హార్ట్ బీట్ లో అసాధారణ మార్పులు చోటుచేసుకుని సడెన్ గా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ గా వ్యవహరిస్తారని వివరించారు. ఎలాంటి గుండె జబ్బులు లేనివారు కూడా వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యే ముప్పు ఉందన్నారు. కాగా.. రక్త నాళాల్లో అడ్డంకుల వల్ల రక్త సరఫరా నిలిచి గుండె ఆగిపోవడం హార్ట్ ఎటాక్ అని చెప్పారు. దీనికి రక్తనాళాల్లో క్లాట్స్ (రక్తం గడ్డకట్టడం), కొవ్వు పేరుకుపోయి నాళాలు కుచించుకుపోవడం తదితర కారణాలు ఉన్నాయన్నారు. హార్ట్ ఎటాక్ బాధితులు కూడా కార్డియాక్ అరెస్టుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. కాగా, తాజా పరిశోధనా ఫలితాలు సడెన్ కార్డియాక్ అరెస్ట్ మరణాలను తగ్గించే మార్గాన్ని ఆవిష్కరించేందుకు తోడ్పడతాయని అధ్యయనకారులు భావిస్తున్నారు.

Related posts

విషమంగా తమ్మినేని ఆరోగ్యం …తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎఐజీ ఆసుపత్రి

Ram Narayana

ఆకాకర గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు..!

Ram Narayana

గుండెపోటుతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కమిషనర్

Ram Narayana

Leave a Comment