Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తమకు టికెట్స్ ఇవ్వకపోవడంపై రాజయ్య ,సుభాష్ రెడ్డి భగ్గు భగ్గు ….!

పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది: స్టేషన్‌ఘన్‌పూర్‌‌ ఎమ్మెల్యే రాజయ్య

  • ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా 
  • ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని వెల్లడి
  • తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని వ్యాఖ్య 

స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యే రాజయ్య.. పార్టీ మార్పు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడమా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. అయితే ఇప్పటికీ కేసీఆర్‌‌పై నమ్మకం ఉందని, టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

తనకు టికెట్ రాకున్నా మాదిగ జాతి తనతోనే ఉందని చెప్పారు. తన రాజకీయ జీవితం ఎమ్మార్పీఎస్ నుంచి మొదలైందని అన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మాదిగ జాతి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మాదిగల పాత్ర కీలకమని చెప్పారు. మాదిగల అస్థిత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్‌‌ది అని అన్నారు. 

ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు ఇస్తామని అంటున్నారని, కానీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని రాజయ్య తెలిపారు. ఒకవేళ టికెట్ రాకుంటే ఏం చేయాలనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై మాదిగలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి మద్దతు తెలుపుతున్నారని వివరించారు.

మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా?: ఉప్పల్ ఎమ్మెల్యే ఆవేదన

  • తనకు ఉప్పల్ టికెట్ ఎందుకు ఇవ్వలోదో చెప్పాలన్న బేతి సుభాష్ రెడ్డి
  • ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్న 
  • వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి

ఉప్పల్ టికెట్ తనకు దక్కకపోవడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎప్పుడైనా పార్టీ జెండా మోశారా? పార్టీ కోసం ఏం చేశారు? అని ప్రశ్నించారు. తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు చేసిన వారికి టికెట్ ఇస్తారా? అని ఆరోపించారు.

ఈ రోజు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఎమ్మెల్యేగా ఉండొద్దా? అని ప్రశ్నించారు. ‘‘ఏం పాపం చేశానని నన్ను తీసేశారు? ఏమైనా తప్పు చేస్తే చెప్పండి. మేకను బలిచ్చే ముందు నీళ్లు పోస్తారు.. నాకు ఆ అవకాశం కూడా లేదా? ఉరి శిక్ష పడిన ఖైదీ ఆఖరి కోరిక అడిగి ఉరి తీస్తారు. నాకు అలాంటి చాన్స్ కూడా లేదా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేనేమైనా కబ్జాలు చేశానా? లేక దళితబంధులో కమీషన్లు తీసుకున్నానా? అని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఇంకా కొన్నిరోజులు ఎదురుచూస్తానని చెప్పారు. వారం పదిరోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

Related posts

రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను: జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

Ram Narayana

అమిత్ షా పర్యటన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి షాక్

Ram Narayana

ఎంపీపై దాడితో చిల్లర రాజకీయమా?: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

Ram Narayana

Leave a Comment