- ఇటీవల న్యాయవ్యవస్థపై సంచలన ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి
- హైకోర్టు సుమోటోగా తీసుకొని, చర్యలు చేపట్టాలని పిటిషన్
- విచారణ జరిపి మూడువారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు
న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు గాను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు రాష్ట్ర హైకోర్టు శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గెహ్లాట్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని, చర్యలు తీసుకోవాలంటూ ఓ న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ అశుతోష్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలకు గాను మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆదేశించింది.
కాగా, ఇటీవల గెహ్లాట్ మాట్లాడుతూ… న్యాయవ్యవస్థలో అంతులేని అవినీతి ఉందని ఆరోపించారు. కొన్ని కేసుల్లో జడ్జిలకు న్యాయవాదులే తీర్పును నిర్దేశిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో వేలాదిమంది న్యాయవాదులు విధులను బహిష్కరించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సీఎం వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని, నమ్ముతానని చెప్పారు.